Yoga for Summer: వేసవి వేడిని దాహాన్ని తగ్గించే సులభమైన.. చిట్కాలు.. ఈ ప్రాణాయామాలు

|

Mar 31, 2021 | 1:37 PM

Yoga for Summer: వేసవిలో రోజు రోజుకీ ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగలతో ఉష్ణోగ్రతలు ఓ రేంజ్ లో నమోదవుతున్నాయి. ఇక ఎండ వేడికి శరీరం అలసిపోతుంది. వడదెబ్బ, నీరసం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది...

Yoga for Summer: వేసవి వేడిని దాహాన్ని తగ్గించే సులభమైన.. చిట్కాలు.. ఈ ప్రాణాయామాలు
Summer Yoga
Follow us on

Yoga for Summer: వేసవిలో రోజు రోజుకీ ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగలతో ఉష్ణోగ్రతలు ఓ రేంజ్ లో నమోదవుతున్నాయి. ఇక ఎండ వేడికి శరీరం అలసిపోతుంది. వడదెబ్బ, నీరసం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉపశమనం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శరీరానికి నీటిని తరచుగా అందించాలి. కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు, నిమ్మరసం తీసుకోవాలి.
అయితే ముఖ్యంగా వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి యోగాలోని కొన్ని ప్రాణామాయాలు ఆచరించాలి. ఇలా చేయడం వల్ల వేడి నుంచి ఉపశమనం పొందొచ్చు.. దాహాన్ని తిగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనిషి శరీరానికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది.

వేసవికాలంతో పోరాడటానికి యోగా నిజంగా సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రాణాయామాలు చేస్తే ఎండ వేడిమి నుంచి మీ శరీరాన్ని కాపాడుతుంది. మీరు రోజులో ఎప్పుడైనా వీటిని ప్రాక్టీస్ చేయవచ్చు. అవి మీరు ఆఫీసులో పని చేస్తున్నా చేసుకోవచ్చు.. ఇంట్లో టీవీ చూస్తూ కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా రెండు ప్రాణాయామ పద్ధతులు శరీరాన్ని చల్లబరిచి రిలాక్స్‌గా ఉండటానికి సహాయపడతాయి. అందులో ఒకటి శీతలీ కరణ ప్రాణాయామం 2. శీత్కారీ ప్రాణాయామం

1. శీతలీ ప్రాణాయామం:

ఇది ఒక రకమైన శ్వాస ప్రక్రియ. ఇది మీ శరీరాన్ని లోపలి నుండి చల్లబరచడానికి ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఈ ప్రాణాయామం చల్లదనం (శీతలి) కలుగజేస్తుంది కాబట్టి దీనికి శీతలి అని పేరు వచ్చింది. యోగా మ్యాట్ కానీ మరేదైనా కానీ వేసుకుని పద్మాసనంలో లేదా సుఖాసనంలో కూర్చోవాలి. చేతులు రెండూ మోకాళ్ల మీద ఉంచి రిలాక్స్‌డ్‌గా ఉండాలి. ఇప్పుడు మీ నాలుకను ఒక ట్యూబ్ మాదిరిగా చేసి దాని ద్వారా లోపలికి గాలిని పీల్చాలి. అలా పీల్చిన గాలిని లోపల ఉంచి నోరు మూసెయ్యాలి. ముక్కు ద్వారా శ్వాస బయటకు వదిలివేయబడుతుంది. ఇలా రోజులో 10 నుంచి 20 సార్లు చేయొచ్చు. దీనిని నడుస్తూ, నిలబడి, కూర్చుని ఎలాగైనా సాధన చేయవచ్చు.

ప్రయోజనాలు :

వేసవిలో ప్రతి రోజూ శీతలీ ప్రాణాయామం చేయడం వల్ల వేడిని తట్టుకునే శక్తి వస్తుంది.
వడదెబ్బ నుండి కాపాడుతుంది.
ఆకలి, దప్పికలు అదుపులో ఉంటాయి.
వేసవిలో వేడి చేయటం, జ్వరం, అలసట, బద్దకం, నిద్రమత్తుని తగ్గిస్తుంది.

2. శీత్కారి ప్రాణాయామం:

శీతలి చేయడం రానివారు దీనిని చేయవచ్చు. గాలి పీలుస్తున్నప్పుడు స్‌స్‌స్‌స్‌……. అనే హస్సింగ్‌ శబ్దం రావడం వల్ల దీనికి శీత్కారి అనే పేరు వచ్చింది. ఇది కూడా పైన పేర్కొన్న పద్ధతిలోనే ఉంటుంది. కాకపోతే ఒకే తేడా ఏమిటంటే, ఇది పళ్ళతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు పైన చెప్పిన పద్దతిలోనే కూర్చుని పై పళ్లను, క్రింది పళ్లను కలిపి ఉంచి శ్వాస తీసుకోవాలి. గట్టిగా, సుదీర్ఘంగా శ్వాస తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న శ్వాసను నిదానంగా ముక్కుద్వారా బయటకు విడుదల చేయాలి. ఇలా 10 నుంచి 20 సార్లు చేస్తే చాలా రిలీఫ్‌గా ఉంటుంది.

ప్రయోజనాలు :

శ్వాస భాగాలను చల్లబరచడం వల్ల శరీరం వేడి నుంచి రక్షింపడుతుంది.
చిరాకు, ఒత్తిడి, ఆందోళలన తగ్గుతుంది.
శరీర ధారుడ్యం పెరుగుతుంది
పళ్లకు, చివుళ్ళకు బలాన్ని చేకూరుస్తుంది.

గమనిక : ఈ ప్రాణాయామాలను బీపీ ఉన్నవారు, ఫ్లూ లేదా జలుబు, ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు చేయకూడదు. ఎవరైనా మొదలు పెట్టేటప్పుడు ఈ ప్రాణాయామ వ్యాయామాలను నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. ఉచ్ఛ్వాస నిశ్చ్వాసలు రెండూ నెమ్మదిగా ఉండాలి.అజీర్తి,, గుండె సమస్యలున్నవారు నిపుణుల సమక్షంలో చేయాల్సి ఉంటుంది. ఇక శరీరాన్ని చల్లబరిచే వ్యాయామం కనుక.. వీటిని శీతాకాలం చేయకుండా ఉండడం అత్యుత్తమం

Also Read: . Vakeel Saab Movie: వకీల్ సాబ్ చిత్ర బృందానికి , ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన పోలీసులు.. అనుమతులు నిరాకరణ
Eggs and Cholesterol: గుడ్డులోని తెల్ల సొన తిని.. పచ్చసొన పడేస్తున్నారా.. ఎన్ని పోషకాలను మిస్ చేసుకున్నారో తెలుసా..!