Sudden Loss of Appetite: ఉన్నట్లుండి ఆకలి మాయమవుతుందా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..
కొంతమందికి అకస్మాత్తుగా ఆకలి తగ్గుతుంది. చాలా మంది దీనిని సాధారణ సమస్యగా విస్మరిస్తుంటారు. కానీ దీనిని నిర్లక్ష్యంగా చేయకూడదు. ఎందుకంటే ఇది తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు. అలసట , వాతావరణం, దినచర్యలో మార్పు వంటి వాటిని తీవ్రంగా పరిగణించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆకలి శరీర అవసరాలను, అంతర్గత సమతుల్యతను సూచిస్తుంది. శరీరానికి శక్తి అవసరమైనప్పుడు, ఆకలిగా అనిపించడం సహజం. ఎటువంటి నిర్దిష్ట కారణం లేకుండా ఆకలి తగ్గితే అది శరీర శక్తి, రోగనిరోధక శక్తి, మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి..

సమయానికి సరైన పరిమాణంలో తినకపోవడం వల్ల బలహీనత, తలతిరగడం, చిరాకు, పనిలో ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. పైగా శరీరం క్రమంగా బలహీనపడటం ప్రారంభమవుతుంది. అంతే కాదు రోజువారీ పనులు కూడా భారంగా అనిపిస్తాయి. దీర్ఘకాలికంగా ఆకలి లేకపోవడం బరువు తగ్గడానికి, పోషకాహార లోపాలకు దారితీస్తుంది. ఇది చర్మం, జుట్టు, నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. స్పష్టమైన కారణం లేకుండానే తరచూ అలసిపోయి నీరసంగా అనిపించేలా చేస్తుంది. అందువల్ల ఆకలిలో మార్పులను అర్థం చేసుకోవడం, సకాలంలో శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.
ఆకలి లేకపోవడం ఏ వ్యాధికి సంకేతం?
ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ వైద్య విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి దీని గురించి చెబుతూ.. తరచూ ఆకలి లేకపోవడం కొన్ని అంతర్గత వ్యాధులతో ముడిపడి ఉంటుంది. గ్యాస్, ఆమ్లత్వం, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు ఆకలిని తగ్గిస్తాయి. థైరాయిడ్ రుగ్మతలు శరీర జీవక్రియను ప్రభావితం చేస్తాయి. ఇది తినాలనే కోరికను తగ్గిస్తుంది. రక్తహీనత (ఐరన్ లోపం), బలహీనత, అలసట తరచుగా ఆకలి తగ్గడానికి దారితీస్తుంది. అంతేకాదు కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు, దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత కూడా ఆకలి తగ్గడానికి దారితీస్తుంది. ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి మానసిక అంశాలు కూడా ఆకలిని అణచివేస్తాయి. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే దానిని శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతంగా పరిగణించాలి. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. ఆకలి లేకపోవడం సమస్య రెండు నుంచి మూడు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే, వేగంగా బరువు తగ్గడం, నిరంతర బలహీనత, తలతిరుగుతున్నట్లయితే, తిన్న తర్వాత వాంతులు సంభవిస్తే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ఆకలి తగ్గకుండా ఉండటానికి ఏం చేయాలి..?
ఆకలిని మెరుగుపరచుకోవడానికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా తినాలి. ఎక్కువసేపు ఆకలిగా ఉండకండి. పండ్లు, కూరగాయలు, పుష్కలంగా ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. డీప్-ఫ్రైడ్, జంక్ ఫుడ్ తినడం మానేయాలి. పుష్కలంగా నీళ్లు తాగాలి. తగినంత నిద్ర పోవాలి. వీటన్నిటితో పాటు ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం, వాకింగ్ చేయాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి.. యోగా, ధ్యానం సహాయపడుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




