మీకు గోళ్లు కొరుక్కునే అలవాటుందా? మానకుంటే ఎంత డేంజరో తెలుసా?
సాధారణంగా గోళ్లు కొరుక్కుంటూ చాలా మంది కనిపిస్తూనే ఉంటారు. అయితే, ఈ అలవాటు అంతమంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. గోర్లు కొరక్కొవడం వల్ల అనేక వ్యాధుల బారినపడే అవకాశాలున్నాయంటున్నారు. గోళ్లు కొరికే అలవాటు మానకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటును మానుకోవాలని పలు సూచనలు చేస్తున్నారు. వాటిని తెలుసుకుందాం.

గోళ్లు కొరకడం అనే అలవాటు సాధారణంగా చాలా మందిలో చూస్తుంటాం. అయితే, ఇది ఎక్కువగా ఉంటే మాత్రం జాగ్రత్తలు అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణలు. గోళ్లు కొరకడం వల్ల ఒత్తిడి, ఆందోళన లేదా నీరసం కారణంగా ప్రారంభమవుతుంది. చాలా మంది దీనిని చిన్న అలవాటుగా భావిస్తారు. కానీ, దీర్ఘకాలం కొనసాగితే మాత్రం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు.
గోళ్లు కొరికే వ్యక్తులకు వచ్చే వ్యాధులు
గోళ్లలో ధూళి, బ్యాక్టీరియా, క్రిములు సులభంగా పేరుకుపోతాయి. ఇవి నోటి ద్వారా నేరుగా శరీరంలోకి బదిలీ చేయబడతాయి. ఇది నోరు, కడుపు, చర్మ సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేగాక, ఈ అలవాటు దంతాల నిర్మాణం, చిగుళ్ల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు.
పిల్లలు, యువకులలో ఈ అలవాటు క్రమంగా తీవ్రమైన సమస్యగా మారుతుందని అంటున్నారు. అందువల్ల హానికరమైన ప్రభావాలను ముందుగానే అర్థం చేసుకోవం ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గోళ్లు కొరికే వ్యక్తులు బాధపడే వ్యాధులు, వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోళ్లు కొరికే వ్యక్తులకు కడుపులో ఇన్ఫెక్షన్
గోళ్లు కొరకడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని.. ఎందుకంటే బ్యాక్టీరియా, మురికి గోళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది విరేచనాలు, కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలను కలిగిస్తుంది. చిగుళ్ళు ఉబ్బడం, రక్తస్రావం, దంతాల ఇన్ఫెక్షన్లు కూడా సాధారణ సమస్యలు. నిరంతరం గోళ్లు కొరకడం వల్ల దంతాలు విరిగిపోతాయి లేదా అరిగిపోతాయి, దీని వలన దంతాలు వంకరగా మారతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో, దంతాల చిగుళ్లు దెబ్బతినవచ్చు. చర్మ వ్యాధులు, గోళ్ల చుట్టూ మంట కూడా రావచ్చు. మానసికంగా, ఈ అలవాటు ఒత్తిడి, ఆందోళన, బ్రక్సిజం వంటి సమస్యలతో ముడిపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇంకా, గోళ్ల పెరుగుదల కుంగిపోవచ్చు, నెయిల్ పాలిష్ రసాయనాలు నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే ప్రమాదకరంగా మారవచ్చని అంటున్నారు.
గోర్లు కొరికే అలవాటు ఎలా ఆపాలి?
గోర్లు కొరికే అలవాటును మానుకోవడానికి ముందుగా దాని కారణాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి సాధనం చేయడం మంచిది. మీ గోళ్లను కొరకాలనే కోరికను నివారించడానికి వాటిని చిన్నగా, పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంకా, మీ గోళ్లకు చేదు రుచిగల మందు లేదా నెయిల్ పాలిష్ వేయండి. మీ చేతులను బిజీగా ఉంచడానికి బంతి, పెన్ను లేదా చిన్న బొమ్మను ఉపయోగించండి.
ఎప్పుడూ నోరు, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. ఒత్తిడి పెరిగినప్పుడు విరామం తీసుకోండి. పిల్లల్లో ఈ అలవాటును సకాలంలో గమనించి నివారించండి. చివరగా, గోర్లు కొరకడం అనే అలవాటును చిన్నదైనా హానికరమని గుర్తుంచుకోండి. అవసరమైతే డాక్టర్ సహాయం తీసుకోండి.
