Diabetes risk in dogs: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. దీనినే డయాబెటిస్ అని కూడా అంటారు. ఎప్పుడో 50 యేళ్లు దాటిన తర్వాత రావల్సిన ఈ వ్యాధి అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వస్తోంది. నిజానికి అస్తవ్యస్తమైపోయిన మన జీవన శైలి దీనికి ప్రధాన కారణం. ఐతే ఇప్పడు డయాబెటిస్ వ్యాధి మనుషులకే కాకుండా పెంపుడు జంతువులకు కూడా వస్తున్నట్లు వివిధ అధ్యయనాలు తెల్పుతున్నాయి. పెంపుడు జంతువులకు వచ్చే డయాబెటిస్ గురించి ఢిల్లీకి చెందిన ప్రముఖ వెటర్నరీ డాక్టర్ అనిల్ సూద్ మాటల్లో మీకోసం..
పెంపుడు జంతువులు కూడా డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. పెట్స్‌కు డయాబెటిస్ వ్యాధి వస్తే దాదాపు మనుషుల్లో కనిపించే లక్షణాలే వీటిల్లో కూడా కనిపిస్తాయి. అంటే తరచుగా మూత్రవిసర్జన చేయడం, అధికంగా నీళ్లు తాగటం చేస్తుంటాయి. పెంపుడు జంతువుల్లో కనిపించే ఈ విధమైన లక్షణాలను యజమానులు చాలా అరుదుగా గమనిస్తుంటారు. అంతేకాకుండా మనుషుల మాదిరిగానే పెంపుడు జంతువులకు కూడా టైప్ I, టైప్ II డయాబెటిస్ వస్తాయని డాక్టర్ సూద్ చెబుతున్నారు. ఇళ్లల్లో పెంపుడు జంతువులను పెంచుకునేటప్పడు యజమానులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా పెట్స్‌కు స్వీట్లు తినిపించకూడదు. పెంపుడు జంతువులకు మధుమేహం ఉంటే, అవి చాలా వేగంగా బరువు తగ్గుతాయి. ఈ స్థితిలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది.
అందువల్లనే అనేక మంది యజమానులు 5 యేళ్ల కంటే ఎక్కువ వయసున్న పెంపుడు జంతువులను మూడు నెల్లకోసారి వైద్య పరీక్షల నిమిత్తం పశువైద్యులను సంప్రదిస్తుంటారు. పెట్‌కు హెపటైటిస్ టీకాలు వేయడం, డైవర్మింగ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడంతోపాటు ఇతర శారీరక పరీక్షలు చేయిస్తుంటారు.