
మనలో చాలా మందికి మెటికలు విరవడం అలవాటే. ఈ అలవాటు చాలా సాధారణం. కొంతమంది చేతులు నొప్పిగా ఉన్నప్పుడు చేతి వేళ్లను ఇలా విరుస్తూ ఉంటారు. కాని మరికొంతమంది మాత్రం ఎలాంటి పనిలేకుండా కూర్చుని ఎటువంటి కారణం లేకుండానే వారి మెటికలు ఒక్కొక్కటిగా విరుస్తూ ఉంటారు. కానీ ఇలా పదే పదే మెటికలు విరవడం అంత మంచి కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకో? మెటికలు విరిచినప్పుడు వేళ్లు ఎందుకు శబ్దం చేస్తాయో? అంతేకాకుండా మెటికలు విరచడం వల్ల ఎముకలు విరిగిపోతాయని, చేతులు దెబ్బతింటాయని కొందరు హెచ్చరిస్తుంటారు. ఇది ఎంతవరకు నిజం? ఈ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
మెటికలు విరిచినప్పుడు ప్రతిసారీ ఒక శబ్దం వినిపిస్తుంది. కొన్నిసార్లు అది చిన్నగా, కొన్నిసార్లు బిగ్గరగా ఉంటుంది. కొంతమంది ఈ శబ్దం వినడానికే మెటికలు విరుస్తుంటారు. క్రమంగా, ఇది అలవాటుగా మారుతుంది. కానీ ఇలా చేయడం నిజంగా మంచిదా? మనం తరచుగా చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా అనే దానిపై అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాల ప్రకారం మనం మెటికలు విరిచినప్పుడు శబ్దం రావడానికి కారణం కీళ్ల మధ్య ఏర్పడే బుడగలు. అంటే, కీళ్ల మధ్య సైనోవియల్ అనే ద్రవం ఉంటుంది. ఇది ఎముకల కదలికకు కందెనగా పనిచేస్తుంది. మన వేళ్లను విరిచినప్పుడు ఈ ద్రవంలో బుడగలు ఏర్పడి ధ్వనిని సృష్టిస్తుంది. అంతే కాదు ఆ సమయంలో నైట్రోజన్ వాయువు విడుదల కావడం వల్ల కూడా శబ్దం వస్తుంది. సైనోవియల్ ద్రవం చాలా సన్నగా ఉంటుంది. ఇది రెండు ఎముకలను కలిపి ఉంచడానికి సహాయపడుతుంది. ఇది వేళ్లలోనే కాకుండా అన్ని కీళ్లలో కూడా ఉంటుంది. ఈ ద్రవం ఎముకలు ముందుకు వెనుకకు కదలడానికి సహకరిస్తుంది.
బయోమెకానిక్స్ దృక్కోణంలో కీళ్ల మధ్య ఒత్తిడి పెరిగినప్పుడు ఈ శబ్దం వస్తుందట. సరళంగా చెప్పాలంటే ఇది పీడన తరంగాల ద్వారా ఉత్పత్తి అయ్యే శబ్దం. మీరు మెటికలను, అంటే మీ వేళ్లను నొక్కినప్పుడు, కీళ్లలో ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఆ రకమైన శబ్దం వస్తుంది. కానీ కొందరు తరచూ ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు. ఇది నిజామే.. నిరంతరం మెటికలు విరిస్తే కీళ్ళు దెబ్బతినడమే కాకుండా అవి విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కొంతమందికి ఆర్థరైటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కానీ ఈ విషయంపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు. మరికొందరు దీనివల్ల ఎటువంటి సమస్యలు రావని చెబుతారు.
ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయని ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ఇలా పదే పదే చేయడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి. ఇది వేళ్లకే పరిమితం కాదు. కొంతమంది తమ మెడ, మడమలు, తుంటిపై, మరికొందరు మోచేతులపై బలవంతంగా మెగికలు విరుస్తారు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. అయితే దీనితో ఎటువంటి సమస్య లేదని తెలిసి కూడా పదే పదే చేయడం మంచిది కాదు. ఎందుకంటే అది ఒక వ్యసనంగా మారితే, కీళ్ళు పగుళ్లు ఏర్పడటానికి, ఎముకలు కోతకు కూడా దారితీయవచ్చు. కాబట్టి నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అలవాటును వీలైనంత తగ్గించుకోవడం చాలా మంచిది.
మరిన్ని జీవనశైలి కథనాల కోసం క్లిక్ చేయండి.