Chicken: కోడి కూర నీచు వాసన లేకుండా కమ్మగా రావాలంటే ఇలా చేయండి.. పాతకాలం నాటి స్టైల్..
చికెన్ కూర వండినప్పుడు నీచు వాసన వస్తోందా? గ్రేవీ కూడా చిక్కగా, రుచిగా రావడం లేదా? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. చికెన్‌ను పసుపుతో శుభ్రం చేసి, ముందుగా నూనెలో బాగా వేయించి, ఉల్లిపాయ-అల్లం వెల్లుల్లి మసాలాలను పచ్చివాసన పోయేలా మగ్గిస్తే కమ్మటి రుచి వస్తుంది. చివర్లో సరైన మోతాదులో మసాలాలు, నీళ్లు వేసి ఉడికిస్తే అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే చికెన్ కర్రీ సిద్ధమవుతుంది.

పండగొచ్చినా.. చుట్టాలొచ్చినా.. వీకెండ్ వచ్చినా.. ఇంకా తినాలనుకున్నా.. నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ఉండాల్సిందే.. కోడి మాంసాన్ని కర్రీగా, ఫ్రైగా అలాగే.. పలు రకాలుగా ఇష్టంగా వండుకుని ఆస్వాదిస్తారు.. అయితే.. కొంతమంది చికెన్ బాగా వండుతారు. కానీ, నీచు వాసన పోదు.. ఇంకా గ్రేవీ కూడా సరిగా రాదు.. అయితే.. కొన్ని టిప్స్ పాటిస్తే.. చికెన్ కర్రీని అద్భుతంగా వండుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా.. కొత్తగా వండే వారైనా.. చికెన్ కూర నీచు వాసన లేకుండా మంచి రుచిగా కమ్మగా రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి..? పాతకాలం స్టైల్ లో ఎలా వండాలి అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
- చికెన్
- నూనె
- ఉల్లిపాయల పేస్ట్ – 3 ఉల్లిపాయలు (బరకగా మిక్సీ పట్టినవి)
- అల్లం వెల్లుల్లి పేస్ట్
- పచ్చిమిర్చి
- టమాటా..
- గరం మసాలా పొడి
- కారం
- ఉప్పు – రుచికి సరిపడా
- నీళ్లు
- కొత్తిమీర – తగినంత
తయారీ విధానం:
చికెన్ సిద్ధం చేసుకోవడం: చికెన్‌ను పసుపు వేసి శుభ్రంగా కడగడం వల్ల నీచు వాసన అస్సలు రాదు.
వేయించడం: కడాయిలో కొంచెం ఎక్కువ నూనె వేసి, కడిగిన చికెన్ ముక్కలను వేసి కలపాలి. మూత పెట్టి చికెన్‌లోని నీరంతా ఇంకిపోయి ఆయిల్ తేలే వరకు 10-15 నిమిషాలు వేయించాలి.
ఉల్లిపాయ – మసాలాలు: నూనె తేలిన తర్వాత బరకగా రుబ్బిన ఉల్లిపాయ పేస్ట్ వేసి 3-4 నిమిషాలు పచ్చివాసన పోయేలా వేయించాలి. ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. కావాలంటే ఒక టమాట కూడా యాడ్ చేసుకోవచ్చు..
కారం, ఉప్పు, గరం మసాలా: ఆయిల్ తేలిన తర్వాత గరం మసాలా పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మసాలాలు ముక్కలకు పట్టేలా 1-2 నిమిషాలు వేయించాలి.
ఉడికించడం: అనంతరం 1 గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌పై గ్రేవీ చిక్కబడే వరకు 10 నుండి 15 నిమిషాలు ఉడికించాలి.
కూర దగ్గరపడి నూనె తేలిన తర్వాత చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేస్తే కమ్మటి చికెన్ కూర సిద్ధమవుతుంది.
ఈ కమ్మనైన చికెన్ కూర అన్నంలోకి, చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ సారి ట్రై చేసి చూడండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
