ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విజయాలు సాధించాలని కోరుకుంటారు. జీవితంలో సక్సెస్ కావాలని, అనుకున్నది సాధించాలని కోరుకోవడం సహజం. కానీ కొందరికే ఇది దక్కుతుంది. ప్రతి వ్యక్తి తన జీవితాంతం వీటి కోసం పోరాడుతుంటాడు. ప్రతి ఒక్కరికి ఒక్కో విధమైన విజయం కావాలి. కానీ ఈ విజయ మార్గంలో కాస్తింత అదృష్టం కూడా తోడైతే తాకినదంతా బంగారంగా మారుతుంది. అయితే జీవితంలో ఈ మూడు పనుతు చేస్తే విజయం తప్పక చేరువవుతుందని చాణక్యుడు చెబుతున్నాడు. కాబట్టి విజయం వెంట పరుగెత్తే వ్యక్తి ఈ మూడు విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అవేంటంటే..
ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర అపారమైనది. కాబట్టి ఏ వ్యక్తి అయినా స్నేహితుల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన వ్యక్తిని స్నేహితుడిగా ఎన్నుకోవాలి. సంతోషం, దుఃఖంలో మీకు మద్దతు ఇచ్చేవారు, కష్ట సమయాల్లో మీకు అండగా నిలిచేవారు నిజమైన స్నేహితులు. ఒక మంచి పనికి మంచి స్నేహితుడు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తాడు. కానీ చెడ్డ వ్యక్తితో స్నేహం పని, లక్ష్యాలపై దృష్టిని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా చెడ్డవారి సహవాసంలో ఉంటే, వెంటనే ఆ స్నేహానికి వీడ్కోలు చెప్పడం మంచిదని చాణక్యుడు చెబుతున్నాడు.
ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి నిరంతరం పని చేయడం చాలా ముఖ్యం. అందుకు సహనం, సంయమనం చాలా అవసరం. ఈ లక్షణాలు క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి ఎంతో సహాయపడతాయి. ఏ విషయంలోనైనా తొందరపడకుండా ఓపికగా, శ్రద్ధగా పని చేయడంపై దృష్టి పెట్టాలని చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు.
విజయవంతమైన జీవితంవైపు అడుగువేయాలంటే సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. సమయాన్ని వృధా చేసే వ్యక్తులు జీవితంలో ఏమీ సాధించలేరు. సమయాన్ని గౌరవించి, సమయానికి అన్ని పనులను పూర్తి చేసే వ్యక్తి మాత్రమే జీవితంలో విజయానికి దగ్గరగా ఉంటాడు. ఆ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకునే గుణం కలిగి ఉండాలని చాణక్యుడు తెలిపాడు.