
అందంగా కనిపించాలని ప్రతి మగువ ఆరాటపడుతుంది. అందుకు బ్యూటీ పార్లర్‌లలో వేల డబ్బు ఖర్చు పెడుతుంటారు. అలాగే ఖరీదైన మేకప్ కిట్స్ కూడా కొనుగోలు చేసి ముస్తాబు అవుతుంటారు. అలాంటి మేకప్ ఉత్పత్తుల్లో ఐల్యాష్ కూడా ఒకటి. ఈ కృత్రిమ కంటి వెంట్రుకలు ధరిస్తే కళ్లు మరింత అందంగా కనిపిస్తాయి. కానీ వీటిని తరచూ వినియోగిస్తుంటే కళ్లపై దుష్ప్రభావాలను చూపాతాయంటున్నారు సౌందర్య నిపుణులు. మీరు ఐల్యాష్ వినియోగిస్తున్నారా? వీటి వల్ల వచ్చే సమస్యలు ఏమిటో తెలుసుకోండి..
ఐల్యాష్ దీర్ఘకాలికంగా ఉపయోగించేవారికి అసౌకర్యం, దురద కలిగిస్తాయి. కనురెప్పల చుట్టూ చర్మం సున్నితంగా ఉంటుంది. కాబట్టి మనం ఐల్యాష్ కనురెప్పలపై అతికించినప్పుడు, అందులోని రసాయన సమ్మేళనాలు కంటి చికాకును కలిగిస్తాయి. కాబట్టి వీటిని వీలైనంత తక్కువగా వినియోగించడం మంచిదంటున్నారు నిపుణులు.
వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. అయితే ఈ రూల్ మేకప్ విషయంలో కూడా పాటించాల్సిందే. లేకుంటే కంటి ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మేకప్‌లో పరిశుభ్రత ఎలా ఉంటుందనుకుంటున్నారా? మేకప్‌లో కూడా పరిశుభ్రత అవసరం. ఇతరులు ఉపయోగించిన బ్రష్, ఐల్యాష్ మొదలైన వాటిని ఉపయోగించడం ద్వారా వ్యాధుల బారిన పడవచ్చు. మేకప్ వస్తువులను వీలైనంత వరకు డస్ట్ ఫ్రీ ప్లేస్‌లో ఉంచడానికి ప్రయత్నించాలి.
ఐల్యాష్ వినియోగించడం వల్ల కనురెప్పలపై సహజంగా ఉండే కనురెప్పలు పొడవుగా పెరగకపోవచ్చు లేదా ఉన్న కనురెప్పలు రాలిపోవచ్చు. కాబట్టి ఐల్యాష్ ఉపయోగించే ముందు తగిన జాగ్రత్తలు తప్పక పాటించాలి. ఐల్యాష్‌లలో పలు రకాల రసాయన సమ్మేళనాలు ఉంటాయి. అవి ముఖంపై దుష్ప్రభావం చూపుతాయి. కళ్లలో మంట, కళ్ల వాపును కూడా కలిగిస్తాయి.
కళ్లు ఆకర్షణీయంగా కనిపించడానికి ఐల్యాష్ వినియోగిస్తారు. కానీ వీటి వినియోగం వల్ల ఒక్కోసారి కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. కనురెప్పల ఇన్ఫెక్షన్లు అస్పష్టమైన దృష్టికి, అంధత్వానికి దారితీయవచ్చు. కాబట్టి వీలైనంత వరకు ముఖంలోని కళ్లు వంటి సున్నిత భాగాలకు మేకప్ వేసుకోవడం మానుకోవాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.