ఒకప్పటి సంప్రదాయ భోజనానికి, నేటి లైఫ్‌స్టైల్‌కి చాలా తేడా ఉంది. సాధారణంగా మనం ఆహారాన్ని మన చేతులతో తింటాం. కానీ ఇప్పుడు చెంచాలతో తినడం అంతా ప్రారంభించారు. ఈ పద్ధతి ఇంటా, బయటా.. చిన్నా, పెద్దా అందరూ ఫాలో అవుతున్నారు. చేతులతో తినాలని ఉన్నా ఎదుటివారు ఏమనుకుంటున్నారో? అనే భావనతో స్పూన్లు వాడేవారూ ఉన్నారు. కానీ ఇటీవలి కొన్ని పరిశోధనల ప్రకారం.. పెద్దల సంప్రదాయాన్ని అనుసరించడమే మంచిదని చెబుతున్నాయి. తద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చట. చేతులతో తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..
ఆయుర్వేదం ప్రకారం.. చేతులతో ఆహారం తీసుకోవడం వల్ల మన జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే ఆహారాన్ని వేళ్లతో తాకగానే.. మనం తినడం ప్రారంభించినట్లు మెదడుకు సందేశం వస్తుంది. ఈ సంకేతాల కారణంగా కడుపు, జీర్ణవ్యవస్థ అవయవాలు పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి. అలాగే మనం చేతులతో తినడం ద్వారా మనం ఏమి తింటున్నాము? ఎంత తింటున్నాం? అని తెలుసుకోవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది.
చేతులతో భోజనం తినడం వల్ల రక్త ప్రసరణకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చేతులతో భోజనం చేసేటప్పుడు వేళ్లు, చేతి కండరాలు బాగా కదులుతాయి. కాబట్టి ఇది శరీరంలో రక్త ప్రసరణకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ముఖ్యంగా చేతులతో ఆహారాన్ని తినడం వల్ల కొన్ని ప్రయోజనకరమైన బ్యాక్టీరియా శరీరంలోకి వస్తుంది. ఈ బాక్టీరియా శరీరంలోని కొన్ని వ్యాధికారక ఇన్ఫెక్షన్ల నుంచి మనలను రక్షిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని కూడా ప్రభావితం చేస్తుంది. ఆహార గ్లైసెమిక్ సూచిక నియంత్రించబడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా తిన్న తర్వాత కడుపు నింపడం మాత్రమే కాదు.. ఆహారాన్ని ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యం. అందుకే చేతులతో ఆహారం తీసుకోవడం వల్ల మానసిక సంతృప్తి కలుగుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఇది స్పూన్‌తో తినడం వల్ల కలగదని అధ్యయనాలు వెల్లడించాయి. ఇకపై చేతులతోనే తింటారు కదూ..