
వేసవిలో ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చే ఏసీలు కూడా పేలిపోతున్నాయి. వినడానికి ఆశ్యర్యంగా ఉన్న కొన్ని చోట్ల ఏసీలు పేలిన ఘటనలు జరుగుతున్నాయి. ఏసీలు పేలిపోవడానికి ప్రధాన కారణం ‘ఓవర్ హీటింగ్’ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వేసవిలో బయట ఉష్ణోగ్రతలు 45-50 డిగ్రీలకు చేరుకున్నప్పుడు ఏసీ కంప్రెసర్లపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది.
దీనికి తోడు ఏసీని గంటల తరబడి విరామం లేకుండా వాడటం వల్ల లోపలి భాగాలు వేడెక్కి మంటలు చెలరేగుతాయి. ముఖ్యంగా అవుట్‌డోర్ యూనిట్లను గాలి ఆడని ఇరుకైన ప్రదేశాల్లో అమర్చినప్పుడు, అక్కడి వేడి గాలి బయటకు వెళ్లలేక కంప్రెసర్ పేలిపోయే ప్రమాదం ఉంది. మరో కీలకమైన అంశం రెఫ్రిజిరెంట్ గ్యాస్ లీకేజీ; గ్యాస్ లీక్ అయినప్పుడు అది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చే చిన్న స్పార్క్‌తో కలిస్తే భారీ పేలుడు సంభవిస్తుంది.
విద్యుత్ లోపాలు కూడా ఈ ప్రమాదాలకు ముఖ్య కారణాలుగా మారుతున్నాయి. నాసిరకం వైరింగ్ వాడటం, లూజ్ కనెక్షన్లు ఉండటం లేదా ఏసీ ప్లగ్ పాయింట్ వద్ద ఇతర భారీ విద్యుత్ పరికరాలను కనెక్ట్ చేయడం వల్ల వైర్లు కాలిపోతాయి. ఓల్టేజ్ హెచ్చుతగ్గులు ఉండే ప్రాంతాల్లో స్టెబిలైజర్ వాడకపోతే ఇంటర్నల్ సర్క్యూట్ బోర్డులు దెబ్బతింటాయి. అలాగే ఏసీని సరిగ్గా సర్వీసింగ్ చేయించకపోతే ఫిల్టర్లలో ధూళి పేరుకుపోయి ఎయిర్ ఫ్లో తగ్గుతుంది, దీనివల్ల కంప్రెసర్ కష్టపడి పనిచేయాల్సి వచ్చి త్వరగా వేడెక్కుతుంది.
ప్రమాదం జరగడానికి ముందు ఏసీ ఇచ్చే సంకేతాలను గమనించడం చాలా ముఖ్యం. ఏసీ నుండి వింత శబ్దాలు రావడం, కాలిన వాసన రావడం, గది సరిగ్గా చల్లబడకపోవడం లేదా ఏసీ వేసిన వెంటనే సర్క్యూట్ బ్రేకర్ ట్రిప్ అవ్వడం వంటివి జరిగితే వెంటనే అప్రమత్తం కావాలి. ఇండోర్ లేదా అవుట్‌డోర్ యూనిట్ల నుండి గాలి లీక్ అవుతున్న శబ్దం వస్తే అది గ్యాస్ లీకేజీకి సంకేతం కావచ్చు. ఇలాంటి సమయాల్లో ఏసీని వెంటనే ఆపేసి అనుభవజ్ఞుడైన టెక్నీషియన్‌ను పిలవాలి.
ఏసీని నిరంతరాయంగా వాడకుండా మధ్యలో కొద్దిసేపు విరామం ఇవ్వడం మంచిది. రాత్రిపూట టైమర్ లేదా స్లీప్ మోడ్ సెట్ చేసుకోవడం వల్ల కంప్రెసర్ మీద లోడ్ తగ్గుతుంది. ప్రతి ఏడాది కనీసం రెండుసార్లు ప్రొఫెషనల్ టెక్నీషియన్‌తో సర్వీసింగ్ చేయించి, వైరింగ్ నాణ్యతను తనిఖీ చేయించుకోవాలి. అవుట్‌డోర్ యూనిట్ చుట్టూ గాలి ఆడేలా ఖాళీ ప్రదేశం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ పొగ లేదా మంటలు కనిపిస్తే వెంటనే ఏసీని ఆపి, మెయిన్ పవర్ సప్లైని కూడా డిస్‌కనెక్ట్ చేయాలి. చిన్నపాటి జాగ్రత్తలతోనే ఇలాంటి భారీ ప్రమాదాలను అరికట్టవచ్చని గుర్తించాలి.