లివర్ సమస్యలు.. ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణమే డాక్టర్ ను సంప్రదించండి..!
2023లో విడుదలైన నివేదికల ప్రకారం.. గత పదేళ్లలో కాలేయ సంబంధిత మరణాల సంఖ్య పెరిగింది. జీవనశైలిలో మార్పులు, కాలేయ వ్యాధులను ఆలస్యంగా గుర్తించడం దీనికి ప్రధాన కారణాలు. ప్రపంచవ్యాప్తంగా కాలేయ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. కొవ్వు కాలేయ వ్యాధి (NAFLD), హెపటైటిస్, కాలేయ సిరోసిస్ వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటితో సంబంధించి మరణాల సంఖ్య గత పది సంవత్సరాల్లో గణనీయంగా పెరిగింది.

కాలేయ వ్యాధులు ఎక్కువ కాలం పర్యవేక్షించకపోతే.. అవి పూర్తిగా తీవ్ర స్థాయికి చేరే వరకు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే ప్రారంభ దశల్లో కనిపించే హెచ్చరికలు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవాలి.
బ్లడ్ వాంతులు
ఇది చాలా ప్రమాదకరమైన లక్షణం. హెమటెమిసిస్ అని పిలిచే ఈ పరిస్థితి కాలేయ వ్యాధుల్లో, ముఖ్యంగా సిరోసిస్ ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కాలేయంలో రక్త ప్రసరణ ఒత్తిడి పెరిగి.. ఆహార నాళంలో ఉన్న రక్తనాళాలు విస్తరించి పగుళ్లు ఏర్పడటం వల్ల వాంతులతో రక్తం బయటకు వస్తుంది. ఇది ఆపద సంకేతం. వెంటనే వైద్యుల సహాయం అవసరం. ఆలస్యమైతే తీవ్రమైన రక్త నష్టం జరుగుతుంది.
శ్వాస ఆడకపోవడం
చాలా మంది ఊపిరితిత్తుల సమస్య అనుకుంటారు. కానీ ఊపిరి అందకపోవడం అనేది తీవ్రమైన కాలేయ జబ్బుకు కూడా ఒక సంకేతం కావచ్చు. ఊపిరి తీసుకునేటప్పుడు గాలి సరిపోనట్లు అనిపించడం, శ్వాస తీసుకోవడంలో కష్టం లేదా గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపించడం గమనించాలి. దీర్ఘకాల కాలేయ వ్యాధులు ఉన్నవారిలో ఇది తరచుగా కనిపించే సమస్యే.
నలుపు రంగులో మలం
మలం గాఢమైన నలుపు రంగులో, తారులాగా కనిపించడం. ఇది జీర్ణనాళం పైభాగంలో రక్తం కారుతోంది అని సూచిస్తుంది. కాలేయ నాళాల్లో ఒత్తిడి పెరిగి అక్కడి రక్తనాళాలు ఉబ్బి పగలడం వల్ల ఈ రక్తస్రావం జరుగుతుంది. ఈ పరిస్థితిలో మలం గట్టిగా చాలా దుర్వాసనతో ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలవడం చాలా అవసరం.
మదిలో గందరగోళం
సాధారణంగా కాకుండా.. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏకాగ్రత కోల్పోవడం, అజాగ్రత్తగా ఉండటం లేదా మెలకువగా ఉండటంలో కష్టం అనిపిస్తే అది ఒక ముఖ్యమైన హెచ్చరికగా భావించాలి. ఈ పరిస్థితిని హెపాటిక్ ఎన్ సెఫలోపతి అనే మెదడు సంబంధిత వ్యాధికి సంకేతంగా చూడవచ్చు. కాలేయం విష పదార్థాలను సరిగ్గా శుభ్రం చేయనప్పుడు.. రక్తంలో అమోనియా వంటి విషాలు చేరి మెదడును దెబ్బతీస్తాయి. దీనికి ఎప్పటికప్పుడు చికిత్స చేయకపోతే.. మెదడు మరింత దెబ్బతింటుంది.
కామెర్లు
కళ్ళలో, చర్మంలో పసుపు రంగు కనిపించడం కాలేయ సమస్యలకు స్పష్టమైన సంకేతం. బిలిరుబిన్ అనే విషపదార్థాన్ని కాలేయం సరిగా ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల ఈ రంగు ఏర్పడుతుంది. ఇది ప్రారంభంలో కనిపించే చిన్న లక్షణమే అయినా.. తీవ్రమైన కాలేయ వైఫల్యానికి సంకేతం కావచ్చు. ఈ పసుపు రంగు కళ్ళలో లేదా చర్మంలో అకస్మాత్తుగా కనిపిస్తే.. దానితో పాటు కుడి వైపున నొప్పి అసౌకర్యం ఉంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించండి.
ఈ విధంగా కాలేయ వ్యాధి ప్రారంభ దశల్లో కనిపించే లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. సకాలంలో వైద్య సేవలు తీసుకుంటే ఈ జబ్బుని నియంత్రించుకోవచ్చు. ఆలస్యం చేయడం అనారోగ్య పరిస్థితిని తీవ్రతరం చేస్తుంది. అందువల్ల ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండి.. తక్షణ వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం.