కొడుకు ప్రేమించాడని.. తండ్రి హత్య
ప్రేమజంట పారిపోయిందని.. అమ్మాయి బంధువులు అబ్బాయి తండ్రిని అతి దారుణంగా హత్య చేశారు.

ప్రమోన్మాదానికి ప్రేమికులు బలవుతుంటారు. కానీ ఈసారి అబ్బాయి తండ్రిని హతమార్చారు. ఓ ప్రేమజంట పారిపోయిందని.. అమ్మాయి బంధువులు అబ్బాయి తండ్రిని అతి దారుణంగా హత్య చేశారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలో ఈ నెల 5న జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. జనగాంకు చెందిన గడ్డం గాలయ్య కూతురు నవనీత, గందిగొల్ల గాలయ్య కొడుకు బాబు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గాలయ్య తన కూతురికి ఇటీవల మరొకరితో నిశ్చితార్థం చేశాడు. ఫిబ్రవరిలోనే పెళ్లి జరగాల్సిఉండగా, తాను బాబును ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పింది. ఇందుకు కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమె బాబుతో కలిసి వెళ్లిపోయింది. దీంతో తమ పరువు పోయిందని భావించిన అమ్మాయి కుటుంబసభ్యులు బాబు మీద, అతని తండ్రి గాలయ్య మీద కక్ష పెంచుకున్నారు. పుట్టపాక గ్రామానికి చెందిన తమ సమీప బంధువులైన దాసరి మల్లేష్, గడ్డం స్వామి, రాజులతో కలిసి హత్యకు ఫ్లాన్ చేశారు. గాలయ్య ఈ నెల 5న మోటార్ సైకిల్‌పై సంస్థాన్ నారాయణపురానికి వెళ్లోస్తుంగా.. అతన్ని వెంబడించిన నిందితులు జనగాం గ్రామ శివారులో కత్తితో దాడి చేసి, హత్య చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు సురేశ్‌ను, అతని బంధువులను పట్టుకుని విచారించగా తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. నిందితులు నవనీత తండ్రి, అన్నదమ్ములు గడ్డం సురేశ్, రమేశ్, వెంకటేశ్‌లను పోలీసులు అరెస్టు చేసి నల్లగొండ కోర్టులో హాజరుపర్చినట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.




