బీహార్ లో దారుణం.. కొడుకును చంపి తల్లిపై సామూహిక లైంగికదాడి
ఉత్తర భారతంలో మరోసారి మానవ మృగాలు రెచ్చిపోయాయి. జరుగుతున్న ఘోరాలపై ప్రభుత్వాలు సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నా కిరాతకుల అగడాలు ఏమాత్రం ఆగడంలేదు.

ఉత్తర భారతంలో మరోసారి మానవ మృగాలు రెచ్చిపోయాయి. జరుగుతున్న ఘోరాలపై ప్రభుత్వాలు సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నా కిరాతకుల అగడాలు ఏమాత్రం ఆగడంలేదు. తాజాగా బీహార్ రాష్ట్రంలో కన్నతల్లి ముందు కొడుకును చంపి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. బక్సర్ జిల్లాలోని ఓ గ్రామం నుంచి మండల కేంద్రమైన చెయ్‌గైన్‌కు బ్యాంకులో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన మహిళపై కామాంధుల కన్నుపడింది. ఐదేండ్ల కొడుకును వెంటబెట్టుకుని వచ్చిన మహిళను ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సమయంలో అడ్డుగా ఉన్నబాబును తీవ్రంగా కొట్టారు. అనంతరం తల్లీబిడ్డ ఇద్దరినీ తాడుతో కట్టేసి సమీపంలో కాలువలో పడేశారు దుండగులు.
కాలువలో వీరిని గమనించిన స్థానికులు రక్షించి చెయ్‌గైన్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాధితులను పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటి మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని సదార్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరైన మున్నీరామ్‌ను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా ఆరుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని చెయ్‌గైన్ పోలీసులు తెలిపారు.




