జంతర్ మంతర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? చాలా మందికి తెలియని 200 ఏళ్ల చరిత్ర!
ఢిల్లీలోని జంతర్ మంతర్ పేరు వెనుక ఆసక్తికర చరిత్ర ఉంది. 1724లో సవాయి జైసింగ్-II నిర్మించిన ఈ ఖగోళ పరిశోధనా కేంద్రానికి యంత్ర మంత్ర అనే సంస్కృత పదం నుంచే జంతర్ మంతర్ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం ఇది చారిత్రక కట్టడంతో పాటు ప్రజాస్వామ్య నిరసనలకు ప్రముఖ వేదికగా గుర్తింపు పొందింది.

ఢిల్లీలోని జంతర్ మంతర్ దేశ రాజకీయ, సామాజిక ఉద్యమాలకు కేంద్ర బిందువుగా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఏదైనా పెద్ద నిరసన, ఆందోళన లేదా ప్రజా ఉద్యమం జరిగినప్పుడు జంతర్ మంతర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ ప్రాంతానికి జంతర్ మంతర్ అనే పేరు ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? అనే విషయం చాలామందికి తెలియదు.
జంతర్ మంతర్ అసలు ఒక ఖగోళ పరిశోధనా కేంద్రం (Astronomical Observatory). దీనిని జైపూర్ మహారాజు సవాయి జైసింగ్–II 1724లో నిర్మించారు. ఖగోళ శాస్త్రంపై ప్రత్యేక ఆసక్తి కలిగిన ఆయన, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాల కదలికలను అత్యంత కచ్చితంగా పరిశీలించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత జైపూర్, ఉజ్జయిని, వారణాసి, మథురలో కూడా ఇలాంటి పరిశీలనా కేంద్రాలను నిర్మించారు. జంతర్ మంతర్ అనే పేరు సంస్కృతంలోని యంత్ర మంత్ర అనే పదం నుంచి వచ్చింది. ఇందులో యంత్ర అంటే పరికరం లేదా కొలిచే సాధనం, మంత్ర అంటే గణన లేదా సూత్రం అనే అర్థం. కాలక్రమేణా యంత్ర మంత్ర అనే పదం ప్రజల వాడుకలో జంతర్ మంతర్‌గా మారింది. ఇక్కడ ఉన్న భారీ రాతి పరికరాల సహాయంతో సమయం, గ్రహాల స్థానాలు, ఖగోళ సంఘటనలను లెక్కించేవారు.
జంతర్ మంతర్‌లోని అత్యంత ప్రసిద్ధ నిర్మాణం సమ్రాట్ యంత్రం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సూర్య గడియారాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని సహాయంతో అత్యంత ఖచ్చితంగా సమయాన్ని లెక్కించే వీలుండేది. అలాగే జైప్రకాశ్ యంత్రం, రామ్ యంత్రం, మిశ్ర యంత్రం వంటి పరికరాలు కూడా ఖగోళ పరిశీలన కోసం ఉపయోగించబడేవి. స్వాతంత్ర్యం తర్వాత ఢిల్లీలోని జంతర్ మంతర్ పరిసర ప్రాంతం ప్రజాస్వామ్య నిరసనలకు ప్రముఖ వేదికగా మారింది.
పార్లమెంట్‌కు సమీపంలో ఉండటం, భద్రతా ఏర్పాట్లు సులభంగా ఉండటంతో అనేక రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సామాజిక సంస్థలు ఇక్కడే తమ నిరసనలు నిర్వహించాయి. దీంతో నేడు జంతర్ మంతర్ అంటే కేవలం ఖగోళ పరిశోధనా కేంద్రం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య స్వరానికి ప్రతీకగా కూడా గుర్తింపు పొందింది. చారిత్రకంగా, శాస్త్రీయంగా విశేష ప్రాధాన్యం కలిగిన ఈ కట్టడం ప్రస్తుతం భారత పురావస్తు శాఖ సంరక్షణలో ఉంది. ఒకవైపు శాస్త్రీయ వారసత్వాన్ని గుర్తుచేస్తూనే, మరోవైపు ప్రజాస్వామ్య ఉద్యమాలకు వేదికగా నిలుస్తూ జంతర్ మంతర్ దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
