ములుగు జిల్లా ఐఎఎస్‌లకు కలిసి రావటం లేదు.

ములుగు జిల్లా ఏర్పడి కనీసం ఏడాది కూడా కాక ముందే , నలుగురు ఐఎఎస్‌లు బదిలీ అయ్యారు. మేడారం మహాజాతర ముందు వరుసగా ముగ్గురు కలెక్టర్ల ఆకస్మికబదిలీలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో 33వ జిల్లాగా ఆవిర్భవించిన ములుగు జిల్లాలో కలెక్టర్ల స్థానచలనంపై చర్చించుకుంటున్నారు. ములుగు జిల్లా ఫిబ్రవరి 17, 2019లో ఆవిర్భవించింది. 2018 ఎన్నికల హామీలలో భాగంగా, ములుగు ప్రజలకు మాట ఇచ్చిన కేసీఆర్‌ , ఆయన తన జన్మదిన కానుకగా ములుగు జిల్లాను ప్రకటించారు. ఈ […]

ములుగు జిల్లా ఐఎఎస్‌లకు కలిసి రావటం లేదు.

ములుగు జిల్లా ఏర్పడి కనీసం ఏడాది కూడా కాక ముందే , నలుగురు ఐఎఎస్‌లు బదిలీ అయ్యారు. మేడారం మహాజాతర ముందు వరుసగా ముగ్గురు కలెక్టర్ల ఆకస్మికబదిలీలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో 33వ జిల్లాగా ఆవిర్భవించిన ములుగు జిల్లాలో కలెక్టర్ల స్థానచలనంపై చర్చించుకుంటున్నారు.

ములుగు జిల్లా ఫిబ్రవరి 17, 2019లో ఆవిర్భవించింది. 2018 ఎన్నికల హామీలలో భాగంగా, ములుగు ప్రజలకు మాట ఇచ్చిన కేసీఆర్‌ , ఆయన తన జన్మదిన కానుకగా ములుగు జిల్లాను ప్రకటించారు. ఈ జిల్లాకు మొదటి కలెక్టర్‌గా యువ ఐఎఎస్‌ అధికారి నారాయణరెడ్డిని నియమించారు. అతి తక్కువ సమయంలోనే ములుగు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నారాయణరెడ్డిని ప్రభుత్వం నెల రోజుల కిందట , నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది.

నారాయణరెడ్డి బదిలీ అనంతరం జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లుకు ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌గా పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన మేడారం మహాజాతరకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్న సమయంలో , సరిగ్గా వారం కిందట ప్రభుత్వం ఆయనను కూడా బాధ్యతలనుంచి తొలగించింది. ఆయన స్థానంలో ఖమ్మం కలెక్టర్‌ కర్ణన్‌కు ములుగు జిల్లా కలెక్టర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన బాధ్యతలు తీసుకుని మేడారం జాతరకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఆయనకు కూడా స్థానచలనం కలిగింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఎఎస్‌ల బదిలీల్లో భాగంగా, కర్ణన్‌ను బాధ్యతల నుంచి తొలగించి, కృష్ణ ఆదిత్య అనే ఐఎఎస్‌ అధికారిని కలెక్టర్‌గా నియమించారు

కర్ణన్‌తో పాటు ప్రస్తుతం మేడారం స్పెషల్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మరో ఐఎఎస్‌ అధికారి వీపీ గౌతమ్‌కు కూడా బదిలీ అయింది. ఆయనకు మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ బదిలీచేశారు. ఒకవైపు మేడారం జాతరకు చకచకా ఏర్పాట్లు జరుగుతుంటే, మరోవైపు కలెక్టర్లు ఇలా వరసగా బదిలీలు కావటం చర్చనీయాంశమైంది. వచ్చే కలెక్టరైనా ఉంటాడో లేక జాతర కాగానే, బదిలీ అవుతాడో.. అని చర్చించుకుంటున్నారు.

Published On - 3:29 pm, Mon, 3 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu