వ్యాక్సిన్ల విషయంలో మాకు గ్లోబల్ లీడర్ షిప్ ఉంది, భారత్ బయోటెక్ సీఎండీ, కృష్ణ ఎల్లా, 123దేశాల్లో క్లినికల్ ట్రయల్స్
వ్యాక్సిన్ల విషయంలో తమకు గ్లోబల్ లీడర్‌షిప్ ఉందని ప్రకటించారు భారత్ బయోటెక్ సీఎం డీ కృష్ణ ఎల్లా.. ప్రపంచ ప్రఖ్యాత జర్నల్స్ లో..
Bharat Biotech:వ్యాక్సిన్ల విషయంలో తమకు గ్లోబల్ లీడర్‌షిప్ ఉందని ప్రకటించారు భారత్ బయోటెక్ సీఎం డీ కృష్ణ ఎల్లా.. ప్రపంచ ప్రఖ్యాత జర్నల్స్ లో తమ సంస్థ జరుపుతున్న కృషి గురించి పలు ఆర్టికల్స్ వచ్చాయని ఆయన తెలిపారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పై కొందరు రాజకీయ నేతలు లేవనెత్తిన సందేహాలపై ఆయన స్పందిస్తూ.. బ్రిటన్ సహా 123 దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, తొలి దశలో 27 కోట్ల మందికి టీకామందును ఇవ్వాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. అలాగే జులై కల్లా 30 కోట్లమందికి దీన్ని ఇచ్ఛేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ మా లక్ష్యాలే మా సంస్థ చిత్తశుద్దికి నిదర్శనమని అన్నారు. తమ టీకామందు పంపిణీ గురించి ఆయన వివరిస్తూ తొలి డోస్ ఇచ్చిన నాలుగు వారాలకు రెండో డోస్ ఇస్తారన్నారు. ప్రస్తుతం 123 దేశాలకు పైగానే సేవలు అందిస్తున్నట్టు ఆయన వివరించారు.
తమ కొవాగ్జిన్ టీకామందును డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతించిందని కృష్ణ ఎల్లా తెలిపారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (2019) నిర్దేశించిన షరతులకు లోబడి ఈ ఆమోదం లభించిందని ఆయన చెప్పారు. మీ వ్యాక్సిన్ మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో సేఫ్ అని నిరూపణ అయితే మీ ప్రాడక్టుకు లైసెన్స్ లభిస్తుందని ఆ సంస్థ గతంలోనే గైడ్ లైన్స్ జారీ చేసిందన్నారు. భారత కంపెనీలపై ఒక విధమైన చులకన భావం ఉందని, ఇది తమకు ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రపంచంలో ప్రతివారూ మన సంస్థలను ఎందుకు చులకనగా చూస్తారని కృష్ణ ఎల్లా ప్రశ్నించారు. ఇండియా మేల్కొనాలి, ఇది కాపీక్యాట్ దేశంకాదు అని వ్యాఖ్యానించారు. ఒక కంపెనీ తమ వ్యాక్సిన్ ని ‘నీరు’అని హేళన చేసిందని ఇది తమనెంతో బాధించిందని ఆయన అన్నారు. ఇండియాలో వచ్ఛే రెండు మూడు రోజుల్లో తమ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్ ప్రారంభమవుతుందని, ఫిబ్రవరి లేదా మార్చికల్లా డేటా అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు. బ్రిటన్ వ్యాక్సిన్ ని ఎవరూ ఎందుకు ప్రశ్నించరని అన్నారు. భారతీయ ట్రయల్స్ ని సులభంగా తప్పు పట్టవచ్ఛుననేగా అని వ్యాఖ్యానించారు.