AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers Protest Live Updates: రైతులు, కేంద్రం మధ్య ఎటూ తేలని చర్చలు.. మరోసారి శుక్రవారం భేటీ.!

నేటితో రైతుల ఆందోళనలు 40వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపధ్యంలో ఇవాళ విజ్ఞాన్ భవన్‌లో ఏడోసారి రైతులు, కేంద్రం మధ్య చర్చలు జరుగుతున్నాయి.

Farmers Protest Live Updates: రైతులు, కేంద్రం మధ్య ఎటూ తేలని చర్చలు.. మరోసారి శుక్రవారం భేటీ.!
Ravi Kiran
|

Updated on: Jan 05, 2021 | 8:54 AM

Share

Farmers Protest Live Updates: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. నేటితో రైతుల ఆందోళనలు 40వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపధ్యంలో ఇవాళ విజ్ఞాన్ భవన్‌లో ఏడోసారి రైతులు, కేంద్రం మధ్య చర్చలు జరుగుతున్నాయి. 40 రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాష్ వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్దత లాంటి కీలకాంశాలపై చర్చించనున్నారు.

కాగా, గతంలో జరిగిన చర్చల్లో రెండు అంశాలపై కుదిరిన ఏకాభిప్రాయానికి కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అటు వ్యవసయ చట్టాల్లోని అభ్యంతరాలపై అంశాల వారీగా చర్చిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే నేటి చర్చలు సఫలం అవుతాయని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రతరం చేయాలని ఇప్పటికే రైతుల సంఘాల నేతలు నిర్ణయం తీసుకున్నారు. కాగా, కేంద్రం, రైతుల మధ్య జరిగిన ఏడో విడత చర్చల్లో కూడా ఇరు వర్గాల మధ్య ఎలాంటి స్పష్టత రాలేదు. తిరిగి శుక్రవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Jan 2021 06:10 PM (IST)

    కేంద్రం, రైతులు మధ్య చర్చలు.. ప్రతిష్టంభన అలాగే..

    కేంద్రం, రైతుల మధ్య జరిగిన ఏడో విడత చర్చల్లో కూడా ఎలాంటి స్పష్టత రాలేదు. కేంద్రం, రైతు సంఘాలు పట్టు వీడట్లేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే యోచన లేదని కేంద్రం స్పష్టం చేస్తుండగా.. చట్టాల్లో సవరణలు వద్దు.. రద్దే ముద్దని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విడత చర్చల్లో కూడా క్లారిటీ రాకపోవడంతో మరోసారి శుక్రవారం కేంద్రం భేటీ కానున్నాయి.

  • 04 Jan 2021 05:34 PM (IST)

    రైతులను కలిసిన కేంద్ర మంత్రి సోం ప్రకాష్..

    విజ్ఞాన్ భవన్‌లోని రైతు నేతలను కేంద్ర మంత్రి సోం ప్రకాష్ కలిశారు. ఈ రోజు కేంద్రం, రైతుల మధ్య ఏడో విడత చర్చలు జరుగుతున్నాయి.

  • 04 Jan 2021 05:28 PM (IST)

    మేమేమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చామా? ప్రభుత్వ ధోరణి చాలా వింతగా ఉంది..

    దేశవ్యాప్తంగా కొత్త వ్యవసాయ చట్టాలను రైతులు సమర్దిస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెబుతున్నారు. మరి అలాంటప్పుడు 40 రోజులుగా చలిలో, వర్షంలో ఆందోళన చేస్తున్న మేమంతా ఎవరం.? మేమేమైనా పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చామా.? ప్రభుత్వ ధోరణి చాలా వింతగా ఉందని రైతు సంఘం నేత జోగిందర్ ఉగ్రహాన్ తెలిపారు.

  • 04 Jan 2021 05:25 PM (IST)

    చట్టంలోని క్లాజులపై చర్చించే ప్రసక్తే లేదు.. రైతు సంఘం నేత కీలక వ్యాఖ్య..

    రైతు సంఘం నేత అభిమన్యు కోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టంలోని క్లాజులపై చర్చించే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ ప్రతిపాదన కొత్తదేమీ కాదని… ఇదివరకే చెప్పారని.. అప్పడే వద్దన్నామని తెలిపారు. మా సమయాన్ని వృధా చేయాలనుకోవడం లేదని తెలిపారు. మరో ప్రత్యామ్నాయం గురించి చర్చించడానికి కూడా సిద్ధం లేమని వెల్లడించారు.

  • 04 Jan 2021 05:21 PM (IST)

    “మా విజయం తథ్యం, కాకపోతే తేదీయే తెలియదు”.. రైతు సంఘాల కీలక వ్యాఖ్యలు

    కొత్త వ్యవసాయ చట్టాల్లో సవరణలు వద్దని.. పూర్తిగా రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రద్దు మినహా మరే ప్రత్యామ్నాయం వద్దని రైతులు అంటున్నారు. ప్రభుత్వం తన పాత పాటే పాడుతోందని, నియంతలా వ్యవహరిస్తోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

    మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో రైతులకు సరైన ధర దొరకని ఘటనలను రైతులు ఉదాహరణగా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు-వ్యతిరేక ధోరణితోనే ఉందని ఆరోపించారు. మూడు చట్టాలు రద్దు చేయడంతో పాటు కనీస మద్ధతు ధరకు చట్టం తెచ్చేవరకు వెనక్కి వెళ్లబోమని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.

  • 04 Jan 2021 05:16 PM (IST)

    కొత్త చట్టాల రద్దుకు కేంద్రం ససేమిరా…

    కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. చట్టాల్లోని ప్రతీ క్లాజ్‌పై చర్చించాలని రైతు సంఘాలను కోరుతోంది. అవసరమైన సవరణలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని సంకేతాలు ఇస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుందని.. రైతు సంఘాల నుంచి మాత్రం ఒక చర్య కూడా లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

  • 04 Jan 2021 04:12 PM (IST)

    ఏడో విడత చర్చల మధ్య లంచ్ బ్రేక్…

    ప్రస్తుతం విజ్ఞాన్ భవన్‌లో లంచ్ విరామ సమయంలో రైతులు భోజనం ఆరగిస్తున్నారు. కేంద్రంతో మూడు వ్యవసాయ చట్టాలపై కీలక చర్చ జరుగుతోంది.

  • 04 Jan 2021 03:43 PM (IST)

    ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులు అర్పించారు..

    ఏడో విడత చర్చలు ప్రారంభించే ముందు కేంద్ర ప్రభుత్వం.. రైతులు.. ఉద్యమంలో మరణించిన రైతులకు నివాళులు అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఉద్యమంలో కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. మరికొందరు చలి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రైతులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని కేంద్రమంత్రులు విచారం వ్యక్తం చేశారు.

  • 04 Jan 2021 03:37 PM (IST)

    కేంద్రం, రైతుల మధ్య ఏడో విడత చర్చలు ప్రారంభమయ్యాయి..

    రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఏడో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. కేంద్రం తరపున మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయాల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ 40 రైతు సంస్థలతో ప్రధాన అంశాలపై చర్చించనున్నారు.

  • 04 Jan 2021 03:35 PM (IST)

    వ్యవసాయ చట్టాలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏమన్నారంటే..!

    ఢిల్లీ సరిహద్దుల్లో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు 40వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటివరకు రైతులకు, కేంద్రం మధ్య ఎలాంటి ఒప్పందం కుదర్లేదు. ఈ క్రమంలోనే ఆహార ధాన్యాలు, మార్కెట్ ధరలపై కనీస మద్దతు ధర(ఎంఎన్‌పీ) ప్రధాన సమస్య అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

  • 04 Jan 2021 03:32 PM (IST)

    కాసేపట్లో ప్రారంభం కానున్న చర్చలు…

    రైతులు, కేంద్రానికి మధ్య చర్చలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఏడో విడత చర్చలు జరుగుతాయి. ఇప్పటికైనా రైతులు ఉద్యమానికి ముగింపు పలుకుతారా.? లేదా.? అనేది చూడాలి.

  • 04 Jan 2021 03:28 PM (IST)

    కేంద్రంతో ఏడోసారి చర్చలకు విజ్ఞాన్ భవన్‌ చేరుకున్న రైతులు..

    కేంద్ర ప్రభుత్వంతో ఏడో విడత చర్చల కోసం రైతుల సంఘాల నాయకులు విజ్ఞాన్ భవన్ చేరుకున్నారు. కొత్త సంవత్సరం వేళ తమకు సరైన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.