Andhra: టీచర్ అవ్వాల్సిన మహేష్ ఇలా చేస్తడనుకోలేదు.. రాత్రివేళ అంతా వెళ్లి పోయాక..
ఉపాధ్యాయుడిగా సమాజానికి సేవ చేయాలన్న కలలతో శిక్షణకు వచ్చిన ఓ యువకుడు అర్ధాంతరంగా తన జీవితాన్నే ముగించుకోవడం విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన కుమారుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తల్లిదండ్రులు, బంధువులను, తోటి విద్యార్థులను తీవ్రంగా కలచివేసింది.

ఉపాధ్యాయుడిగా సమాజానికి సేవ చేయాలన్న కలలతో శిక్షణకు వచ్చిన ఓ యువకుడు అర్ధాంతరంగా తన జీవితాన్నే ముగించుకోవడం విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన కుమారుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తల్లిదండ్రులు, బంధువులను తీవ్రంగా కలచివేసింది. స్థానిక వేణుగోపాలపురం ప్రభుత్వ డైట్ కళాశాలలో చోటు చేసుకున్న ఈ ఘటన విద్యార్థుల్లో భయాందోళనలకు కారణమైంది. వివరాల ప్రకారం.. సాలూరు మండలం జిల్లేడువలస గ్రామానికి చెందిన కూనేటి మహేష్ (24) డిగ్రీ పూర్తి చేసిన అనంతరం 2024లో ఉపాధ్యాయ శిక్షణ కోసం డైట్ కళాశాలలో చేరాడు. కళాశాల ప్రాంగణంలో ఉన్న బాలుర వసతిగృహంలో తోటి విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం రాత్రి వసతిగృహంలోని రీడింగ్ రూమ్‌లో సహ విద్యార్థులతో కలిసి చదువుకున్న మహేష్, అందరూ గదులకు వెళ్లిపోయిన తర్వాత అక్కడే ఉండిపోయాడు. రాత్రంతా గదికి రాకపోవడంతో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో తోటి విద్యార్థులు రీడింగ్ రూమ్‌కి వెళ్లి చూడగా విగత జీవిగా కనిపించాడు. మహేష్ ఉరివేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న విజయనగరం రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. మహేష్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం ఉండగా, దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ, ఆర్థిక సమస్యలే కారణమై ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే కళాశాలకు చేరుకున్న తల్లి, బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.
ఈ ఘటన డైట్ కళాశాలలో తీవ్ర విషాద ఛాయలను మిగిల్చింది. ఘటనపై ఆర్జేడీ విజయభాస్కర్, డీఈవో మాణిక్యం నాయుడు, రిటైర్డ్ డీఈవో డాక్టర్ ఎన్టీ నాయుడు ఆరా తీశారు. మహేష్ మృతిపై ప్రిన్సిపాల్ రామకృష్ణారావు, అధ్యాపకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
