కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభించిన కేంద్రమంత్రి గడ్కరీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభమైంది. వర్చువల్‌ విధానం ద్వారా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు.

కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభించిన కేంద్రమంత్రి గడ్కరీ
Follow us

|

Updated on: Oct 16, 2020 | 1:13 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభమైంది. వర్చువల్‌ విధానం ద్వారా కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లైఓవర్ ను లాంఛనంగా ప్రారంభించారు. దీనితో పాటు రాష్ట్రంలోని మరో 9 జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అలాగే ఈ సందర్భంగా రూ. 15,592 కోట్లుతో చేపడుతున్న16 వంతెనలకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు వీకే సింగ్‌, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2.6 కి.మీల పొడవున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. దీనికి మొత్తం రూ.502 కోట్లు ఖర్చు చేసిన నిర్మాణం చేపట్టారు. ఇందులో కేంద్రం వాటా రూ.355.8 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.146.2కోట్లు ఖర్చు చేసింది.. 46 స్పాన్లతో ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది. 900 పనిదినాల్లో ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎలివేటెడ్‌ బ్రిడ్జిలు సాధారణంగా నాలుగు వరసలే ఉంటాయి. కానీ, కనకదుర్గ ఫ్లైఓవర్ ఆరు వరసలుగా నిర్మాణం చేయడంతో దక్షిణాదిలో తొలి ప్రాజెక్టుగా, దేశంలో మూడో ప్రాజెక్టుగా రికార్డుల్లోకెక్కింది. తొలి రెండు ఆరు వరసల ఫ్లైఓవర్లు ముంబయి, దిల్లీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి రెండేళ్లలోనే దీని నిర్మాణం పూర్తికావల్సి ఉండగా, పలు అవాంతరాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. గత ఏడాది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ ఫ్లైఓవర్‌ను సత్వరమే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించడంతో గడిచిన ఆరేడు నెలల్లో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.

దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభం కావడం సంతోషకర పరిణామమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేసిన సీఎం, కేంద్ర పెద్దలకు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. 2016 కృష్ణా పుష్కరాలకి ముందే దుర్గగుడి ఫ్లైఓవర్ కట్టేస్తా అని ప్రగల్భాలు పలికి, చేతకాక వదిలేసిన వారు కూడా ఆనందపడవచ్చని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.