కుర్చీ కింద మిర్చీ.. ఉత్తమ్ పోస్ట్ ఊడడం ఖాయం ?
హుజూర్‌నగర్ ఓటమి టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవికి ఎసరు తెస్తోందా ? పరిణామాలు.. ఢిల్లీకి పరుగులు పెడుతున్న తెలంగాణా కాంగ్రెస్ సీనియర్లు.. జోరుగా మీడియా లీకేజీలు.. ఇవి చూస్తే ఉత్తమ్ కుమార్ పోస్ట్ ఊస్టింగ్ అన్న వాదనకు బలం చేకూరుతోంది. పలు దఫాలుగా గెలుస్తూ వచ్చిన ఉత్తమ్ తాజా ఉప ఎన్నికల్లో హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్ర సమితికి ధారాదత్తం చేయడంతో వ్యక్తిగతంగా నిరాశకు గురయ్యారు. అంతే కాకుండా.. పదవిని సైతం కోల్పోయే పరిస్థితిని […]
హుజూర్‌నగర్ ఓటమి టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవికి ఎసరు తెస్తోందా ? పరిణామాలు.. ఢిల్లీకి పరుగులు పెడుతున్న తెలంగాణా కాంగ్రెస్ సీనియర్లు.. జోరుగా మీడియా లీకేజీలు.. ఇవి చూస్తే ఉత్తమ్ కుమార్ పోస్ట్ ఊస్టింగ్ అన్న వాదనకు బలం చేకూరుతోంది. పలు దఫాలుగా గెలుస్తూ వచ్చిన ఉత్తమ్ తాజా ఉప ఎన్నికల్లో హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్ర సమితికి ధారాదత్తం చేయడంతో వ్యక్తిగతంగా నిరాశకు గురయ్యారు. అంతే కాకుండా.. పదవిని సైతం కోల్పోయే పరిస్థితిని కొనితెచ్చుకున్నాడు.
నిజానికి తాను ఎంపీగా గెలిచిన తర్వాత పార్టీ శ్రేయస్సుకే పెద్దపీట వేసి.. గెలిచే సత్తా వున్న వారిని పార్టీ సీనియర్ల సమక్షంలో చర్చించి నిర్ణయం తీసుకుంటే ఓటమి చెందినా అది సమిష్టి నిర్ణయం అన్న భావన వుండేది. కానీ అలా కాకుండా ఏకపక్షంగా తన సీటు.. తన కుటుంబానికే వుండాలన్న ఫీలింగ్‌తో తన సతీమణికి పట్టుబట్టి మరీ ఇప్పించుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాంతో ఇపుడు హుజూర్‌నగర్ ఓటమికి తానే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.
నిజానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత టిపిసిసి పదవి నుంచి ఉత్తమ్ తప్పుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. టిపిసిసి రేసులో పలువురి పేర్లు కూడా వినిపించాయి. కానీ 3,4 నెలల్లో పార్లమెంటు ఎన్నికలు వుండడంతో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం టిపిసిసి చీఫ్ మార్పుకు వెనుకంజ వేసింది. అయితే ఈ సంవత్సరం మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా పుంజుకుని నాలుగు లోక్‌సభ సీట్లను దక్కించుకుంది.
అందులో భాగంగా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎంపీగా గెలిచారు. దాంతో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. లోక్‌సభ ఎన్నికల్లోను ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరోసారి ఉత్తమ్ కుమార్ పోస్టుకు గండం వచ్చిందన్నారు. మళ్ళీ కొందరు నేతలు పైరవీలు చేసుకున్నారు. అయితే అంతలోనే హుజూర్‌నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడంతో టిపిసిసి మార్పు మరోసారి వాయిదా పడింది.
తాజా పరిణామాల నేపథ్యంలో హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగిరి కాంగ్రెస్ పార్టీ నుంచి చేజారి గులాబీ గూటికి దక్కింది. దాంతో మరోసారి ఉత్తమ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి ప్రతికూల ఫలితాలు తెస్తున్నాయంటూ పలువురు ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. దానికి తోటు టిపిసిసి అధ్యక్ష పదవి మారడం ఖాయమన్న సంకేతాలు ఢిల్లీ వర్గాల్లో ఊపందుకోవడంతో మరోసారి ఆశావహులు రంగంలోకి దిగారు. శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు టిపిసిసి అధ్యక్ష పదవి కోసం ఢిల్లీలో పైరవీలు షురూ చేసినట్లు సమాచారం.
ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికలకు ముందు అక్కడి పిసిసి చీఫ్ పదవిని భూపిందర్ సింగ్ హుడాకు కట్టబెట్టడం ద్వారా అసలు సీట్లే రావనుకున్న స్థాయి నుంచి మెరుగైన ఫలితాలు పొందే స్థాయికి కాంగ్రెస్ పార్టీ చేరుకుంది.. సో.. అదే ఫ్యార్ములాను తెలంగాణలోను అవలంభించడం ద్వారా పబ్లిక్‌లో చరిష్మాతోపాటు.. అర్ధబలం, అంగబలం పరిపూర్ణంగా వున్న నేతను టిపిసిసి అధ్యక్షునిగా ఎంపిక చేస్తారని సమాచారం. సో.. త్వరలోనే ఉత్తమ్ కుమార్ కుర్చీ కింద మిర్చి కన్‌ఫర్మ్ అన్నమాట… పాపం ఉత్తమ్..!