నిర్మలమ్మ బడ్జెట్… కొన్ని తీపి గుళికలైతే..మరికొన్ని చేదు మాత్రలు !

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ దాదాపు రెండున్నర గంటలపాటు సుదీర్ఘ ప్రసంగం చేసి పార్లమెంటుకు కేంద్ర బడ్జెట్ సమర్పించారు. 1951 లో తొలి బడ్జెట్ సమర్పణ అనంతరం అతి పెద్దదైన.. లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్ ఇదే.. 170 ఏళ్ళ క్రితం బ్రిటన్ కు చెందిన బెంజమిన్ డిజ్రాయెరీ కేవలం 45 నిముషాల సేపు ప్రసంగించారు. మాజీ ప్రధాని, మాజీ ఆర్ధికమంత్రి కూడా అయిన మన్మోహన్ సింగ్.. 90 నిముషాలకు మించి ప్రసంగించలేదు. బడ్జెట్ స్పీచ్ ఇచ్చిన సమయానికి, […]

నిర్మలమ్మ బడ్జెట్... కొన్ని తీపి గుళికలైతే..మరికొన్ని చేదు మాత్రలు !

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ దాదాపు రెండున్నర గంటలపాటు సుదీర్ఘ ప్రసంగం చేసి పార్లమెంటుకు కేంద్ర బడ్జెట్ సమర్పించారు. 1951 లో తొలి బడ్జెట్ సమర్పణ అనంతరం అతి పెద్దదైన.. లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్ ఇదే.. 170 ఏళ్ళ క్రితం బ్రిటన్ కు చెందిన బెంజమిన్ డిజ్రాయెరీ కేవలం 45 నిముషాల సేపు ప్రసంగించారు. మాజీ ప్రధాని, మాజీ ఆర్ధికమంత్రి కూడా అయిన మన్మోహన్ సింగ్.. 90 నిముషాలకు మించి ప్రసంగించలేదు. బడ్జెట్ స్పీచ్ ఇచ్చిన సమయానికి, అందులోని వాస్తవ అంశాలకు పోలిక ఉందా అన్నదే పరిశీలించవలసిన అంశం.

1951 లో పార్లమెంటుకి తొలి బడ్జెట్ సమర్పించారు. నాడు కేవలం రెవెన్యూ, వ్యయం .. ఈ రెండింటినీ బడ్జెట్లో ప్రస్తావించేవారు. ఈ రెండింటికీ సాధారణంగా ‘ గ్యాప్ ‘ ఉంటూ వచ్ఛేది. దాన్ని విదేశీ సహాయంతోనో, విదేశీ రుణాలతోనో భర్తీ చేసేవారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. నేటి బడ్జెట్లు మన జీవితాలను ప్రతిబింబించేవిగా ఉంటున్నాయి. స్టాక్ మార్కెట్, ఫారిన్ ఎక్స్ చేంజ్ మార్కెట్, అంతర్జాతీయ అభిప్రాయాలను, విదేశీ కంపెనీలను కూడా ఆర్ధికమంత్రి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో బడ్జెట్లు ఎంతో సీక్రెట్ గా ఉంటే ఈ నాటి బడ్జెట్ల ప్రతిపాదనలు ఎలా ఉంటాయో ముందే ఊహించ గలుగుతున్నాం. ఇక నిర్మలమ్మ సమర్పించిన 2020 బడ్జెట్ లోని విశేషాలు.

న్యూ ఇన్ కమ్ టాక్స్ స్లాబ్స్ 

5 నుంచి 7.5 లక్షల ఆదాయమైతే 10 శాతం పన్ను

7.5 నుంచి 10 లక్షల ఆదాయమైతే 15శాతం పన్ను

10 నుంచి 12.5 లక్షలైతే.. 20 శాతం పన్ను

12.5 నుంచి 15 లక్షలైతే 25 శాతం పన్ను

15 లక్షలు మించితే 30 శాతం పన్ను

5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించనక్కరలేదు.

5 నుంచి 7.5 లక్షల ఆదాయం ఉన్నవారి పన్ను చెల్లింపును 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు.

డైరెక్ట్ టాక్సేషన్ పథకంలో లిటిగేషన్ ను తగ్గించేందుకు ఆర్ధికమంత్రి  ఓ పథకాన్ని ప్రతిపాదించారు. వివిధ అప్పిలేట్ ఫోరాలలో 4.83 లక్షల డైరెక్ట్ కేసులు పెండింగులో ఉన్నాయి. లిటిగేషన్ లో లక్షల కోట్ల సొమ్ము మూలుగుతోంది.

బ్యాంకు డిపాజిట్ బీమాను లక్ష రూపాయల నుంచి 5 లక్షలకు పెంచాలన్న ప్రతిపాదన సామాన్యునికి ఎంతో ఊరట నిచ్ఛే అంశం. ఇటీవల ప్రయివేట్, కో-ఆపరేటివ్ బ్యాంకుల వైఫల్యాల నేపథ్యంలో ఇది ఎంతో అవసరం. ఈ చర్యవల్ల డిపాజిటర్లకు,, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు చాలా ప్రయోజనం కలుగుతుందని బ్యాంక్ బజార్ డాట్ కామ్ సీఈఓ అదిల్ శెట్టి అభిప్రాయపడ్డారు.

బడ్జెట్ ఇన్ కమ్ రూ.. 22.46 లక్షల కోట్లు..బడ్జెట్ వ్యయం రూ.. 30.42 లక్షల కోట్లు.. పబ్లిక్ సెక్టార్ సంస్థల షేర్ల అమ్మకాలు, రుణాల సేకరణ, కరెన్సీ నోట్ల ముద్రణ వంటి ఇతర మార్గాల ద్వారా చూస్తే.. మొత్తానికి బడ్జెట్ లోటు రూ. 8 లక్షల కోట్లన్న విషయం అర్థమైంది.

పన్ను చెల్లింపుదారులను వేధిస్తే సహించబోమని ఆర్ధికమంత్రి చెప్పారు. అయితే ఈ కార్యాచరణ ఎలా అన్నది స్పష్టం కావడంలేదు. పన్నుల వసూళ్లు, ఫేస్ లెస్ అసెస్ మెంట్ సిస్టమ్ వల్ల వేధింపులు తగ్గుతాయని నిర్మల అన్నారు. అయితే పన్నుల బెడద తక్కువగా ఉన్నప్పుడే వేధింపులు కూడా తగ్గుతాయి.

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు రూ. 4,400 కోట్లను కేటాయించారు. దేశంలో మరే ఇతర రాష్ట్రానికీ ఇంత కేటాయింపు లేదు.

దేశ భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది.

ఏప్రిల్ నుంచి సరళీకృత జీఎస్టీ రిటర్నుల విధానాన్ని అమలులోకి తెస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇఛ్చారు. అలాగే ఈజ్ ఆఫ్ లివింగ్ అంశాన్ని ప్రస్తావించారు.

ఆర్ధిక వృద్ది రేటు మందగించినప్పుడు దాన్ని(ఆర్థికవ్యవస్ధను) పునరుజ్జీవింపజేసేందుకు పటిష్టమైన బడ్జెట్ ఉండాలన్నది నిపుణుల అభిప్రాయం. అలాగే నిరుద్యోగ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. దేశంలో వ్యవసాయరంగ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రైతులకోసం ‘బిగ్ బ్యాంగ్ బడ్జెట్’ ఎంతైనా అవసరం.

అంతా ఆశించిన విధంగా లేని లేని బడ్జెట్

ఆదాయం పన్ను రేట్లు పెద్దగా ప్రయోజనం కలిగించేవిగా లేవు. వ్యవసాయరంగానికి మరిన్ని కేటాయింపులు, నిధులు అవసరం. బీమా పథకం వల్ల వీరికి అంతగా ఒరిగేదేమీ లేదు. వరి, గోధుమ పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందన్నది సందేహాస్పదమే.

ప్రజల చేతుల్లోకి నేరుగా సొమ్ము  వెళ్లేందుకు ఉపయోగపడే పథకాలను ప్రభుత్వం ప్రకటించలేదు. అలాంటప్పుడు ఆర్ధిక వ్యవస్థ ఎలా పునరుజ్జీవింపబడుతుంది ?

ఇటు బడ్జెట్ ప్రకటించగానే అటు.. స్టాక్ మార్కెట్ ఢమాల్ అంది..

మొత్తానికి ప్రధాని మోదీ అదృష్టవంతులే. గత ఆరేళ్లుగా చమురు ధరలు తక్కువగానే కొనసాగుతున్నాయి. మూడేళ్ళ క్రితం మోదీ చేబట్టిన నోట్ల రద్దు పథకం మెల్లగా ఫలితాలు ఇస్తుండవచ్ఛు. కరోనా వైరస్ కారణంగా చైనా ఎకానమీ ఇంకా దిగజారవచ్చుకూడా.

ఏది ఏమైనా..నిర్మలా సీతారామన్ బడ్జెట్ బలహీనమైదైనా.. దేశ ఆర్ధిక వ్యవస్థ మళ్ళీ ఉజ్వలం కావచ్చునన్న ఆశ మిణుకుమిణుకుమంటోంది. అటు ఒక విధంగా చూస్తే ఈ తాజా బడ్జెట్ కూడా మోదీ ప్రభుత్వంలోని గత 6 బడ్జెట్ల మాదిరే ఉంది. ఇది చిదంబరం లేదా ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రతిరూపమే అన్నా ఆశ్ఛర్యం లేదు

Disclaimer: ఈ ఆర్టికల్‌లోని అంశాలు రచయిత సొంత అభిప్రాయాలు..వాటిని టివీ9 ఛానల్, టీవీ9 వెబ్‌సైట్ అభిప్రాయాలుగా పరిగణించ వద్దని మనవి.

-డాక్టర్ పెంటపాటి పుల్లారావు(ఆర్ధిక, రాజకీయవేత్త)

Published On - 2:32 pm, Sun, 2 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu