ఆర్టీసీని మూడు రకాలుగా విభజన.. కేసీఆర్ సంచలన నిర్ణయం!

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ సోమవారం మరోసారి అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. సునీల్ శర్మ కమిటీ నివేదికపై సుమారు 4 గంటలు చర్చించిన ఆయన.. ఆర్టీసీని పూర్తిగా ప్రయివేటీకరణ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థను ప్రక్షాళన చేస్తామని.. భవిష్యత్తులో ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో 10,400 బస్సులున్నాయి. వీటిని భవిష్యత్‌లో మూడు రకాలుగా విభజించాలని నిర్ణయించారు. 50%(5200) బస్సులు […]

  • Ravi Kiran
  • Publish Date - 12:59 am, Tue, 8 October 19
ఆర్టీసీని మూడు రకాలుగా విభజన.. కేసీఆర్ సంచలన నిర్ణయం!

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ సోమవారం మరోసారి అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. సునీల్ శర్మ కమిటీ నివేదికపై సుమారు 4 గంటలు చర్చించిన ఆయన.. ఆర్టీసీని పూర్తిగా ప్రయివేటీకరణ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థను ప్రక్షాళన చేస్తామని.. భవిష్యత్తులో ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేశారు.

ప్రస్తుతం ఆర్టీసీలో 10,400 బస్సులున్నాయి. వీటిని భవిష్యత్‌లో మూడు రకాలుగా విభజించాలని నిర్ణయించారు. 50%(5200) బస్సులు ఆర్టీసీలో  నడపనుండగా.. 30%(3100) అద్దె బస్సులు గాను, మరో 20%(2100) బస్సులను పూర్తి ప్రయివేటు బస్సులుగా నడపాలని సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ చార్జీలు, ప్రయివేట్ బస్సుల చార్జీలు సమానంగా ఉంటాయన్నారు. కాగా, ఇప్పటికీ 21% అద్దె బస్సులను ఆర్టీసీ నడుపుతోందని.. అదనంగా మరో 9% అద్దె బస్సులను పెంచితే ఆర్టీసీకి కొత్త బస్సులు వచ్చినట్లేనని ముఖ్యమంత్రి అన్నారు.

ఆర్టీసీ యూనియన్ల అతి ప్రవర్తన వల్లే ఈ చర్యలన్నీ చేపట్టాల్సి వచ్చిందని కేసీఆర్ స్పష్టం చేశారు. తాము ఎక్కిన చెట్టు కొమ్మను తామే నరుక్కున్నారని ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి సీఎం అన్నారు. సమ్మెను తీవ్రతరం చేస్తామనడం హాస్యాస్పదమని.. యూనియన్లు తీసుకునే అర్థరహితమైన నిర్ణయాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయమని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం దృష్టిలో, ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ఆర్టీసీ సిబ్బంది 1200 మాత్రమే ఉన్నారని మరోసారి ఆయన గుర్తు చేశారు. ఇకపోతే సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను డిస్మిస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని.. వాళ్ళంతట వాళ్ళే తప్పుకున్నారని… గడువులోపల విధుల్లోకి చేరనివాళ్ళు “సెల్ఫ్ డిస్మిస్” అయ్యారని వెల్లడించారు.  అంతేకాక తొలగిపోయిన వాళ్ళు డిపోల దగ్గర కానీ, బస్ స్టేషన్ల దగ్గర కానీ గొడవ చేయకుండా ప్రత్యేక పోలీసు బృందాలను చేస్తామన్నారు. సబ్సిడీ బస్‌పాస్‌లు ఇకముందు కూడా ఎదావిధిగా కొనసాగుతాయని సీఎం చెప్పారు. ఇకపై ఆర్టీసీలో యూనియన్ల ప్రసక్తే ఉండదని సీఎం తేల్చి చెప్పారు.

ఆర్టీసీకి కొత్త నెత్తురు, జవసత్వాలు రావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. భవిష్యత్‌లో యూనియనిజం అనేది ఇకపై ఆర్టీసీలో ఉండబోదని.. సంస్థ అద్భుతంగా రూపుదిద్దుకుని లాభాల బాట పట్టేలా కృషి చేస్తామన్నారు. అంతేకాక కార్మికులకు బోనస్ ఇచ్చే పరిస్థితి కూడా త్వరలోనే వస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. పండగ సీజన్‌లో ప్రజలను ఇబ్బందులకు గురి చేసే రీతిలో ఇష్టం వచ్చినట్లుగా సమ్మెకు దిగడం దురహంకారమని ఆయన మండిపడ్డారు. కాగా, ఆర్టీసీ ప్రక్షాళనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు ప్రశంసిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.