సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్‌పై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి..

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర సీఎం కేసీఆర్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు.

సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్‌పై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు..  చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి..

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర సీఎం కేసీఆర్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ పార్టీ నేతలు. అదేవిధంగా మత సామరస్యంతో ఉన్న హైదరాబాద్‌ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞాపన పత్రం అందజేసింది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన బండి సంజయ్‌పై ప్రజా ప్రాతినిధ్యం చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు టీఆర్ఎస్ నేతలు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్‌ కుమార్‌ ఎస్‌ఈసీ కమిషనర్‌ పార్ధసారిథిని కలిశారు. సీఎం కేసీఆర్‌ దేశ ద్రోహి, హిందూ వ్యతిరేకి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్య జరుగుతున్న యుద్ధం.. దేశద్రోహులు టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీ నాయకులు, అభ్యర్థులుగా మీ ముందుకు వస్తున్నరంటూ సంజయ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్‌ మీడియా, టెలివిజన్‌ ఛానెల్స్‌లో ప్రసారం అయిన ఈ వాఖ్యల వీడియోలను టీఆర్‌ఎస్‌ నాయకులు ఆధారాలుగా ఎస్‌ఈసీకి అందజేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదన్నారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి. బండి సంజయ్‌ను వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఎన్నికల ప్రచారం చేయకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ అయిన సంజయ్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడన్నారు. అవగాహన లేకుండా చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. చట్టం ప్రకారం ఎంపీ సంజయ్‌పై ఎన్నికల కమిషన్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.