AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శమరిమలలో కరోనా కలకలం.. ఆలయ సిబ్బందితో సహా 39 మందికి కొవిడ్ పాజిటివ్..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. మెల్లమెల్లగా అన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. అటు కేరళలోనూ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో 39మంది ఆలయసిబ్బంది, భక్తులకు కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు.

శమరిమలలో కరోనా కలకలం..  ఆలయ సిబ్బందితో సహా 39 మందికి కొవిడ్ పాజిటివ్..!
Balaraju Goud
|

Updated on: Nov 27, 2020 | 5:00 PM

Share

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. మెల్లమెల్లగా అన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. అటు కేరళలోనూ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో 39మంది ఆలయసిబ్బంది, భక్తులకు కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు.

ట్రావెన్‌కోర్‌ దేవస్థాన బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. వార్షిక పూజల కోసం నవంబరు 16 నుంచి శబరిమలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో శబరిమల దర్శనానికి భక్తులు చేరుకుంటున్నారు. దీంతో కొద్దిమంది సిబ్బంది అస్వస్థతకు గురి కాగా కరోనా పరీక్ష చేయించింది దేవస్థాన బోర్డు. దీంతో 27మంది ఆలయ సిబ్బంది సహా 39 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వారు తెలిపారు. కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. అందులో భాగంగా పరీక్షలు చేయించామని బోర్డు అధికారులు వెల్లడించారు. సన్నిధానం, పంబ, నీలక్కల్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పాయింట్లలో మొత్తం 39 కేసులు నమోదైనట్లు తెలిపారు.

మరోవైపు, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో యాత్రికులు వచ్చే ప్రాంతాలైన తిరువనంతపురం, తిరువళ్ల, చెంగనూర్‌, కొట్టాయం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో యాంటిజెన్‌ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా నిబంధనల ప్రకారం పది నుంచి అరవై ఏళ్ల వయసున్న వారినే ఆలయంలోనికి అనుమతిస్తున్నామని తెలిపారు. స్పెషలిస్టులతో కూడిన వైద్య బృందాలను ఆలయంలో విధులు నిర్వర్తించేందుకు ఏర్పాటు చేశామని దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు.

ఇదిలావుంటే, ప్రతి ఏటా డిసెంబరు 26న మండలపూజ నిర్వహిస్తారు. జనవరి 14న మకరవిళక్కు నిర్వహించిన తర్వాత జనవరి 20న ఆలయాన్ని మూసేస్తారు. ఏటా ఈ కార్యక్రమాలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరై అయ్యప్ప దర్శనానికి పోటెత్తుతారు. కరోనా నేపథ్యంలో రోజుకు 1,000 మంది, వారాంతాల్లో 2,000 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థాన బోర్డు తెలిపింది. కాగా, కరోనా మొదలైన తర్వాత వార్షిక పూజల కోసం మొదటిసారి ఆలయాన్ని తెరిచారు.