Weather Update: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజుల క్రితం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్లు పేర్కొంది. నేటితో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, భద్రాది కొత్తగూడెంపాటు యాదాద్రి-భువనగిరి, ములుగు జిల్లాల్లో 3 రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ప్రస్తుతానికైతే రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని.. ఇదే వేగాన్ని కొనసాగిస్తే రానున్న మూడురోజుల్లో రాష్ట్రమంతటా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
2 లేదా 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. తెలంగాణకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక.. గతేడాది జూన్ మొదటివారం కల్లా తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు.. ఈసారి రెండువారాలకు పైబడి ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ ప్రకటనతో రైతన్నలు సాగుకు సిద్ధమవుతున్నారు.
అయితే.. తొలకరి వర్షాలు చూసి విత్తనాలు నాటకుండా కాస్త వేచిచూడడమే మంచిదని సూచిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఇక.. చాలా రోజులుగా ఎండతీవ్రత, ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలు క్రమంగా వాతావరణం చల్లగా మారడంతో ఊరట చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..