ఐదు రోజుల వ్యవధిలో అన్నాచెల్లెళ్ల మృతి.. అనాథలైన ఇద్దరు చిన్నారులు!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తిర్యాణి మండలానికి చెందిన కొడిమెల ప్రసాద్ (34) ఈ నెల 5న హత్యకు గురయ్యాడు. అన్న మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన చెల్లెలు మార్కొండ సువర్ణ (28) అనారోగ్యంతో నవంబరు 11న కన్నుమూసింది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే అన్నాచెల్లెళ్లు ఇద్దరూ మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోవడం స్థానికులను కలచివేస్తోంది..

అన్నాచెల్లెళ్ల అనుబంధం అనిర్వచనీయం. ఆప్యాయతకు, అనురాగానికి ప్రతిరూపం ఈ బంధం. అన్నకు కష్టం వస్తే చెల్లి మనసు తల్లడిల్లుతుంది.. చెల్లి కన్నీరు పెడితే అన్న గుండె విలవిల్లాడుతుంది. అలాంటి ఆత్మీయ బంధాన్ని విధి ఐదు రోజుల వ్యవధిలోనే మృత్యువు రూపంలో విడదీసింది. ఒకే కుటుంబంలో వరుసగా చోటుచేసుకున్న రెండు మరణాలు ఆ ఇంట్లో తీరని విషాదాన్ని నింపాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలానికి చెందిన కొడిమెల ప్రసాద్ (34) ఈ నెల 5వ తేదీన హత్యకు గురయ్యాడు. కుటుంబానికి అండగా నిలవాల్సిన అన్న అర్ధాంతరంగా తనువు చాలించడంతో చెల్లెలు మార్కొండ సువర్ణ (28) తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నిన్నటి వరకు తనకు తోడుగా ఉన్న అన్న ఇక లేడన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. అన్న మరణం ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేసింది.
ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన సువర్ణ నవంబర్ 11న కన్నుమూసింది. అన్న మరణించిన ఐదు రోజులకే చెల్లెలు కూడా మృత్యుఒడికి చేరడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఒకరి వెంట మరొకరు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు.. ఇద్దరు చిన్నారుల తల్లిగా ఉన్న సువర్ణ మరణం ఆ పిల్లల జీవితాల్లో తీరని లోటును మిగిల్చింది. నిన్నటి వరకు అమ్మ ఒడిలో ఆడుకున్న ఆ చిన్నారులు.. నేడు మాతృప్రేమకు దూరమయ్యారు. అమ్మ ఎప్పటికీ తిరిగిరాదన్న విషయం కూడా తెలియని ఆ పసిపిల్లల భవిష్యత్తును తలచుకుని బంధువులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్ల నవ్వులు వినిపించిన చోట ఇప్పుడు రోదనలు మిన్నంటుతున్నాయి. నిన్నటి వరకు ఒకరికొకరు తోడుగా ఉన్న ఆ ఇద్దరూ.. నేడు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఐదు రోజుల వ్యవధిలోనే రెండు మరణాలు ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి విధి రాసిన ఈ విషాద ముగింపు స్థానికులను సైతం కలచివేస్తోంది.




