AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఎస్‌బీఐ ఏటీఎంపై దుండగులు దాడి చేసి నగదు అపహరించారు. నైటీలు, మాస్కులు ధరించి వచ్చిన నిందితులు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసినట్లు సమాచారం. చోరీకి గురైన నగదు ఎంతన్నది ఇంకా తెలియాల్సి ఉండగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

Viral Video: నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
Kamareddy SBI ATM Robbery
Srilakshmi C
|

Updated on: Oct 12, 2026 | 12:24 PM

Share

కామారెడ్డి, అక్టోబర్ 12: నైటీలు ధరించి, ముఖాలకు మాస్కులు, కళ్లజోళ్లు పెట్టుకొని వచ్చిన దుండగులు ఎస్‌బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి నగదును అపహరించిన ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో ఏటీఎంలోకి చొరబడిన నిందితులు నగదును ఎత్తుకెళ్లి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..

అక్టోబర్ 11 ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి 1.30 గంటల మధ్య గాంధారి మండల కేంద్రంలోని కామారెడ్డి–బాన్సువాడ ప్రధాన రహదారిపై ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎంలో ఈ చోరీ జరిగింది. తెల్లని స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు ఏటీఎంలోకి ప్రవేశించారు. మొదట మెషీన్‌పై ఏదో రసాయనం చల్లినట్లు సమాచారం. అనంతరం గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి, అందులోని నగదును తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఏటీఎం చోరీ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, ఎస్‌ఐ మహేందర్ అక్కడ పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ టీమ్ కూడా ఘటనా స్థలాన్ని తనిఖీ చేసి ఆధారాలను సేకరించింది.

ఏటీఎంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో నిందితుల కదలికలు రికార్డయినాయి. ఆ దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చోరీ జరిగిన తీరుపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఏటీఎంలో నుంచి దుండగులు ఎంత నగదు అపహరించారన్నది ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. శుక్రవారం ఏటీఎంలో రూ.10 లక్షలు జమ చేసినట్లు బ్యాంకు అధికారులు ఎస్‌ఐకి తెలిపినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత ఖాతాదారులు ఎంత నగదు విత్‌డ్రా చేశారు? ఘటన సమయానికి ఏటీఎంలో ఎంత మొత్తం మిగిలి ఉంది? అనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

Follow Us