Special Train: భారత రాష్ట్రపతి కోసం ప్రత్యేక ట్రైన్.. ఇంద్ర భవనాన్ని తలపించే సౌకర్యాలు.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
భారత రాష్ట్రపతులకు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఇందులో రాష్ట్రపతితో పాటు వారి కుటుంబసభ్యులు, అధికారులు, సిబ్బంది మాత్రమే ప్రయాణించవచ్చు. 2026 ఆగస్టు 4న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంత రాష్ట్రమైన ఒడిశాకు ట్రైన్‌లో వెళ్లిన ప్రయాణం దేశం దృష్టిని ఆకర్షించింది.

భారత రాష్ట్రపతులకు దేశంలో ప్రత్యేకంగా అనేక సౌకర్యాలు ఉంటాయి. రాష్ట్రపతి భవన్‌లో నివాస సదుపాయంతో పాటు కట్టుదిట్టమైన భద్రత, ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రత్యేక విమానం లాంటివి ఉంటాయి. ఇక కాలు బయట పెట్టినా సరే ప్రత్యేక ఎస్కార్ట్ వాహనాలు ఉంటాయి. అయితే రాష్ట్రపతికి ప్రత్యేకమైన రైలు కూడా ఉంటుంది. ఈ రైలులో కట్టుదిట్టమైన భద్రత, అద్భుతమైన విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి. ప్రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైన్ అంటే కేవలం రైలు కాదు.. దేశ ప్రథమ పౌరురాలి భద్రత, సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించారు. భారతీయ రైల్వేలు రాష్ట్రపతి ప్రయాణానికి అత్యంత అరుదైన భద్రతా ప్రోటోకాల్‌ను పాటిస్తాయి. రాష్ట్రపతి ప్రయాణించే రైలు ఒంటరిగా వెళ్లదు. వారి రక్షణ కోసం మొత్తం మూడు రైళ్లు నడుస్తాయి. ప్రెసిడెన్షియల్ స్పెషల్ రైలు కంటే ముందు ఒక పైలట్ రైలు ట్రాక్‌ను పరీక్షించి మార్గం సురక్షితంగా ఉందని నిర్ధారిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతి, ఉన్నతాధికారులు, రాష్ట్రపతి భవన్ సిబ్బంది ఉండే ప్రత్యేక రైలు ప్రయాణిస్తుంది. చివరగా రియల్ ఎస్కార్ట్ రైలు అనుసరిస్తుంది.
రాష్ట్రపతి ప్రయాణిస్తున్న సమయంలో అదే ట్రాక్‌పై మరో రైలుకు అనుమతి ఉండదు. అంతేకాకుండా మెకానికల్ సమస్యలు తలెత్తితే ఉపయోగించేందుకు సమీప స్టేషన్‌లో ఒక స్టాండ్ బై రైలును కూడా సిద్ధంగా ఉంచుతారు. ప్రయాణం పూర్తయ్యే వరకు మొత్తం మార్గాన్ని పూర్తిగా నిఘాలో ఉంచుతారు. ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణం సాగేలా చూస్తారు. రాష్ట్రపతి ప్రయాణించే ఈ ప్రత్యేక రైలు.. దేశంలోనే అత్యంత విలాసవంతమైన టూరిస్ట్ రైలు అయిన మహారాజా ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని కోచ్‌లను ప్రత్యేకంగా సిద్ధం చేసి ఈ ప్రత్యేక రైలు రూపొందించారు. రాష్ట్రపతి, వారి కుటుంబ సభ్యులు, అధికారులు, భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఈ రైలులో విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. రాష్ట్రపతి బస చేసే ప్రత్యేక కేబిన్‌ను నవరత్న అని పిలుస్తారు. ఇందులో ఒక విశాలమైన లివింగ్ రూం, రెండు బెడ్‌రూమ్‌లు, అటాచ్డ్ వాష్‌రూమ్‌లు ఉంటాయి. ప్రయాణంలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఒక ప్రత్యేక మెడికల్ కోచ్ కూడా అందుబాటులో ఉంటుంది. డైనింగ్, లాంజ్ కోచ్‌లు, అత్యాధునిక వంటగదులు కూడా ఈ రైలులో ఉంటాయి.
రాష్ట్రపతి ఉండే కోచ్ కిటికీలకు డబుల్ గేజ్డ్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ అమర్చి ఉంటాయి. రైలులో రాజ్ క్లబ్ లాంజ్, మయూర్ మహల్, రంగమహల్ వంటి విలాసవంతమైన రెస్టారెంట్లు ఉంటాయి. వీటికి కావాల్సిన ఆహార పదార్థాలను తయారుచేసే వంట సిబ్బంది అంతా రాష్ట్రపతి భవన్‌కు చెందినవారే ఉంటారు. బయటి వస్తువులను ఇక్కడ అసలు ఉపయోగించరు. ప్రయాణంలోనే అధికారిక సమీక్షలు నిర్వహించుకునేందుకు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ అండ్ సెక్రటేరియట్ కోచ్ అందుబాటులో ఉంటుంది. ఈ రైలు అధునాతన ఎయిర్ సస్పెన్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా ఎలాంటి కుదుపులు లేకుండా ఈ రైలు సాఫీగా సాగిపోతుంది. భద్రత కోసం రైలులోనే ప్రత్యేక కమాండ్ సర్వైలెన్స్ కంట్రోల్ రూములు కూడా పనిచేస్తాయి.
