కిక్ కొట్టకుండానే బండి స్టార్ట్.. అందివచ్చిన టెక్నాలజీతో కొత్త అవిష్కరణ.. బ్లూటూత్‌తో బైక్ స్టార్ట్..!
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చక్కటి అవిష్కరణతో ఔరా అనిపిస్తున్నాడు.
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చక్కటి అవిష్కరణతో ఔరా అనిపిస్తున్నాడు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కిక్కు కొట్టకుండానే బైకును స్టార్ట్ చేస్తున్నాడు. 18 ఏళ్ల ఓ కుర్రాడు.. బ్లూటూత్ పరిజ్ఞానంతో ద్విచక్ర వాహనానికి జోడిస్తూ కొత్త సౌకర్యాలు అందుబాటులోకి తీసుకుని వచ్చాడు. రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేలా, ఆకతాయిల నుంచి అమ్మాయిలకు రక్షణ కల్పించేలా సాంకేతికత అభివృద్ధి చేశాడు.
కృష్ణా జిల్లా తిరువూరు ప్రాంతానికి చెందిన అల్తాఫ్.. పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సాంకేతికతను ఉపయోగించి సొంతంగా ఏదైనా చేయాలన్న కోరికతో బైకుపై ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. కరోనా కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని తన ఆలోచనకు పదునుపెట్టాడు. ఇందుకోసం ముందుగా సీ, సీ ప్లస్, జావా వంటి కోర్సులు ప్రవీణ్యం సాధించాడు. నూటపది రోజులపాటు… నిత్యం పది నుంచి పన్నెండు గంటల పాటు శ్రమించాడు. బ్లూటూత్ పరిజ్ఞానంతో వాహనం స్టార్ట్ చేసేందుకు అవసరమైన ప్రోగ్రాంను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. సర్య్కూట్‌లో ఆర్‌ఎఫ్ఐడీ, ఆల్కహాల్ గుర్తించేందుకు అవసరమైన సెన్సర్లను అమర్చాడు. వాహనం ఉన్న కచ్చితమైన ప్రాంతం తెలుసుకోవటానికి ఓ సిమ్‌కార్డ్‌ను సైతం ఏర్పాటు చేశాడు. అయితే, ఈ సాంకేతికతను అభివృద్ధి చేయటంలో పదిహేడు సార్లు విఫలమైనప్పటికీ పట్టుదలను ఏమాత్రం వదులుకోలేదు. మళ్లీమళ్లీ ప్రయత్నించాడు. విఫలమైన ప్రతీసారి సూచనల కోసం పలువురిని సంప్రదించాడు. తన సంకల్ప బలంతో అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాడు అల్తాఫ్.
తానూ సాధించి విజయాన్ని అల్తాఫ్ వివరించాడు. బండిని స్టార్ట్ చేయాలంటే హెల్మెట్ కచ్చితంగా ధరించాలి. హెల్మెట్‌లో టచ్ సెన్సార్ ఉంటుంది. ఫోన్‌లోని యాప్ సాయంతో బ్లూటూత్ ద్వారా వాహనాన్ని స్టార్ట్ చేయవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగితే కోడ్‌లో ఇచ్చిన ఫోన్ నంబర్లకు మెసేజ్ వెళ్లిపోతుంది. అందులో లైవ్ లొకేషన్ వివరాలు కనిపిస్తాయి. దాని ఆధారంగా ప్రమాదం జరిగిన చోటు ఎంతదూరంలో ఉందన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. రోడ్డు ప్రమాదం జరిగినా వ్యక్తులకు ఏం కాకపోతే బండిలో అమర్చిన మరో బటన్ సాయంతో అవతలి వారికి సేఫ్‌గానే ఉన్నామనే మెసేజ్ వెళ్తుంది. అంతేకాదు ఈ పరిజ్ఞానం మహిళలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వారి వాహనానికి ఏమైనా ప్రమాదం జరిగినా. బండికి అమర్చిన బటన్స్ నొక్కటం ద్వారా పోలీసులకు సమాచారం వెళ్తుంది. ఈ సాంకేతికత వల్ల ఇతరులెవరూ వాహనాన్నీ చోరీ చేసే అవకాశం ఉండదు. దీనిని అభివృద్ధి చేయటంలో మా కుటుంబ సభ్యులు ఎంతగానో ప్రోత్సాహం అందించారని అల్తాఫ్ వివరించాడు.