Telangana Cabinet: అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..?

తెలంగాణ కేబినెట్‌ సమావేశం శనివారం జరగనుంది. ఈ భేటీలో రైతులకు సాయం కింద ఇచ్చే రైతు భరోసాలోని షరతులు, విధివిధానాలపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతుభరోసాపై కసరత్తు పూర్తికావొస్తున్న వేళ... కొర్రీలు లేని భరోసా కావాలంటూ విపక్షాల కన్నెర్ర చేస్తున్న వేళ ఇవాళ్టి కేబినెట్‌ మీటింగ్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

Telangana Cabinet: అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..?
Revanth Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 04, 2025 | 7:31 AM

సంక్రాంతికి రైతు భరోసాతో వస్తున్నాం అంటోంది అధికార కాంగ్రెస్‌. మీరిచ్చే భరోసా నిండా బొక్కలే.. రైతుకు సంపూర్ణ భరోసా కావాల్సిందే అంటూ కన్నెర్ర చేస్తున్నాయి అపోజిషన్ పార్టీలు. ఇటు పోరాటానికి ముహుర్తం పెట్టి యుద్ధభేరి మోగించింది బీఆర్‌ఎస్ పార్టీ. అన్ని కొర్రీలే… రేవంత్‌ సర్కార్‌తో రైతులకి వర్రీలే అంటూ అటు బీజేపీ కూడా భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్‌ మీటింగ్‌పై ఆసక్తి నెలకొంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని ఇటు పొలిటికల్‌ పార్టీలు… కనికరించేలా డెసిషన్స్‌ ఉండాలని అటు రైతులు. ఇప్పుడు అందరి చూపు కేబినెట్‌ వైపే అన్నట్లుగా ఉంది పరిస్థితి.

ఇవాళ తెలంగాణ కేబినెట్‌ భేటీకానుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్‌లో మంత్రిమండలి సమావేశం జరనుంది. ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ.. రైతులకు సాయం కింద ఇచ్చే రైతు భరోసాలోని షరతులు, విధివిధానాలపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతుభరోసాపై కసరత్తు పూర్తికావొస్తున్న వేళ… కొర్రీలు లేని భరోసా కావాలంటూ విపక్షాల కన్నెర్ర చేస్తున్న వేళ ఇవాళ్టి కేబినెట్‌ మీటింగ్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. రైతు భరోసాపై సీఎం నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయని ఇటు రైతులోకంతో పాటు అటు అపొజిషన్‌ పార్టీలు ఆసక్తిగా చూస్తున్నాయి.

ఇక ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన భేటీలో భరోసా అమలుపై కీలక నిర్ణయాలు తీసుకుంది సబ్‌కమిటీ. జనవరి 5 నుంచి 7 వరకు రైతు భరోసా కోసం దరఖాస్తులు స్వీకరించబోతోంది. దీంతో ప్రతిపక్షాలు అప్రమత్తమయ్యాయి. మళ్లీ దరఖాస్తులా.. ఇదెక్కడి యవ్వారం అంటూ కస్సుమంటున్నాయి.

రైతుభరోసా పథకానికి కొత్త షరతులు విధిస్తోందంటూ ప్రభుత్వంపై యుద్దం ప్రకటించింది గులాబీపార్టీ. కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించడం దారుణమని విమర్శిస్తూ… రైతుల్ని పోరాటానికి సమాయత్తం చేస్తోంది. భరోసా ఎగవేత కారణంగా సగటు అన్నదాతకు ఇప్పటివరకు ప్రభుత్వం ఎంత బాకీ పడిందో దండోరా వెయ్యడానికి సిద్ధమైంది ప్రధాన ప్రతిపక్షం. రైతుబంధు పథకాన్ని బొందపెట్టేందుకే కుట్ర జరుగుతోందని నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఎక్కడికక్కడ పోరాటం చేస్తాం.. ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

అటు బీజేపీ సైతం రైతు పక్షపాతులమంటూ మీడియాకెక్కింది. భరోసా పథకంలో కొత్తకొత్త కొర్రీలు పెట్టి రైతులను నట్టేట ముంచుతోందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. రుణమాఫీకి కోతలుపెట్టినట్టే.. రైతుభరోసాను కూడా దక్కకుండా చేస్తోందని, రైతుపై అణచివేత జరుగుతోందని ఆరోపిస్తోంది.

మొత్తంగా…ఇటు విపక్షాల విమర్శలు, పోరాటాలు చేస్తామంటూ వార్నింగులు… అటు ప్రభుత్వ నిర్ణయాలపై రైతులు పెట్టుకున్న ఆశలతో ఇవాళ్టి కేబినెట్‌ భేటీ ఆసక్తికరంగా మారింది.. రైతు భరోసాపై కేబినెట్‌ ఏం చర్చిస్తుందో.! ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందో…! తెలియాలంటే వేచిచూడాల్సిందే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..