Republic Day Essay: ప్రజల ప్రాథమిక హక్కులను, బాధ్యతలను తెలియజేసే రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామో తెలుసా..!

72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మన దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది.. మరి జనవరి 26న ఎందుకు రిపబ్లిక్‌డేగా జరుపుకుంటామో తెలుసుకుందాం..!

  • Surya Kala
  • Publish Date - 4:17 pm, Sat, 23 January 21
Republic Day Essay:  ప్రజల ప్రాథమిక హక్కులను, బాధ్యతలను తెలియజేసే రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామో తెలుసా..!

Republic Day Essay:  72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మన దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి.. తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించిన మహానీయులను.. స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన గొప్ప వ్యక్తులను స్మరిస్తాం..దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది.. మరి జనవరి 26న ఎందుకు రిపబ్లిక్‌డేగా జరుపుకుంటామో తెలుసుకుందాం..!

దాదాపు 200 ఏళ్ల బ్రిటిషర్ల పాలన నుంచి భరతమాతకు 1947 ఆగస్టు 15న విముక్తి లభించింది. ఇక 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కనుక ప్రతి ఏడాది అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటామని అందరికీ తెలుసు. నిజానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు ఆగి జనవరి 26 తేదీ జనవరి 26న రాజ్యాంగాన్ని అమలు చేసే రోజుగా ఎంచుకున్నారు.

జనవరి 26న ప్రాముఖ్యత ఏమిటంటే.. లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. జలియన్‌వాలాబాగ్ ఉదంతం సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.
అప్పటి వరకూ ఉన్న బ్రిటీష్ కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం (1935) రద్దు అయింది. జనవరి 26 1950 నుంచి భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శినికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్‌‌ను ఏర్పాటుచేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ ఎన్నిక కాగా, డాక్టర్‌ అంబేడ్కర్‌ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అధ్యాయనం చేసి ప్రజాస్వామ్య విధానంగా రూపొందించారు. అనేక సవరణల అనంతరం, 1949 నవంబర్‌ 26న దీనిని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది. రచనకు మొత్తం రూ.64 లక్షలు ఖర్చయ్యింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగల దేశంగా ఖ్యాతి గాంచింది. రాజ్యాంగంలోని అనేక అంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు.

కుల, మత, లింగ వర్ణ వివక్ష లేకుండా ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో కల్పించారు. అలాగే ప్రతి పౌరుడు దేశసేవకు, దేశాభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలను కలిగి ఉండాలని అందులో పొందుపరిచారు. వీటన్నింటకీ గుర్తుచేసుకుంటా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం.

Read Also: కస్టమర్లకు కరోనా భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తూ కోటి 37 లక్షల కరోనా భీమా ఇస్తున్నహోటల్