Corona Insurance for Customers: కస్టమర్లకు కరోనా భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తూ కోటి 37 లక్షల కరోనా భీమా ఇస్తున్న హోటల్

కరోనాతో పర్యాటకులు లేక కళతప్పిన హోటల్స్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పర్యాటక రంగం..కరోనా విషయంలో పర్యాటకులకు భద్రత కల్పించే విషయంలో సింగపూర్‌లో హోటల్ ముందడుగు.. కరోనా భీమాని కల్పిస్తూ..

Corona Insurance for Customers: కస్టమర్లకు కరోనా భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తూ కోటి 37 లక్షల కరోనా భీమా ఇస్తున్న హోటల్
Follow us

|

Updated on: Jan 23, 2021 | 3:39 PM

Corona Insurance for Customers: కరోనా ప్రపంచ జనాభాపైనే కాదు.. ఆర్ధిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా దేశ విదేశాల్లో పర్యాటక రంగం కుదేలైపోయింది. అత్యంత తీవ్రంగా నష్టపోయింది. కరోనా వ్యాప్తి నివారణకు జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలను మూసివేయడం.. విమాన సర్వీసులు నిలిపివేయడంతో పర్యాటక ప్రాంతాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో పర్యాటకులపై ఆధాపడి ఉండే అనేక సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా చాలా హోటల్స్ మూతపడే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం కరోనా కు వ్యాక్సిన్ రావడం.. ప్రజల్లో మరింత అవగాహన పెరగడంతో కొన్ని విమాన సర్వీసులను పునరుద్ధరించారు. దీంతో కొన్ని దేశాల్లోని హోటల్స్ కస్టమర్లకు సాదర స్వాగతం పలుకుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ.. కస్టమర్లకు కరోనా భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి

అయితే కరోనా విషయంలో పర్యాటకులకు భద్రత కల్పించే విషయంలో సింగపూర్‌లో ఓ హోటల్‌ గ్రూపు మరో అడుగు ముందుకు వేసింది. కస్టమర్లకు ఏకంగా ‘కరోనా బీమా ను అందిస్తుంది. కస్టమర్లకు కరోనా సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఖర్చులు బీమా ద్వారా తామే భరిస్తామని చెప్పింది.

హాంకాంగ్‌కు చెందిన షాంగ్రి-లా గ్రూప్‌ ఆఫ్‌ హోటల్‌కు సింగపూర్‌లో నాలుగు చోట్ల హోటళ్లు ఉన్నాయి. మొన్నటి వరకు లాక్‌డౌన్‌ కారణంగా కస్టమర్లు లేక కళతప్పిన ఈ హోటళ్లు ఇప్పుడు పూర్తిస్థాయిలో తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ఎన్ని కరోనా జాగ్రత్తలు తీసుకున్నా కస్టమర్లు హోటళ్లలో బస చేయడానికి భయపడుతుండడంతో షాంగ్రి-లా గ్రూపు ‘కరోనా బీమా’ను తీసుకొచ్చింది.

ఈ హోటళ్లలో గదులు బుక్‌ చేసుకునే సమయంలోనే కస్టమర్‌కు కోటి 37లక్షల రూపాయల ఆరోగ్య బీమా చేస్తుంది. దీనికి ప్రీమియం మొత్తం హోటల్‌ యాజమాన్యమే చెల్లిస్తుంది. ఈ బీమా కింద.. బస చేసే సమయంలో కస్టమర్‌కు కరోనా సోకితే క్వారంటైన్‌ అవడానికి ప్రత్యేక గదిని ఉచితంగానే కేటాయిస్తామని చెప్పారు. క్వారంటైన్‌ వల్ల విమాన ప్రయాణం రద్దయితే.. మరో విమానం టికెట్‌ను కొనుగోలు చేసి ఇస్తారు. వైద్యానికి అయ్యే ఖర్చును కూడా తామే చెల్లిస్తామని హోటల్‌ యాజమాన్యమే చెప్పింది.

అయితే ఈ కరోనా బీమా కేవలం విదేశీ పర్యటకులకు మాత్రమే వర్తిస్తుందని షాంగ్రి-లా గ్రూప్‌ వెల్లడించింది. జనవరి ఒకటో తేదీ నుంచి జూన్‌ 30వ తేదీలోపు తమ హోటళ్లలో గదులు బుక్‌ చేసుకున్న వారికి బుకింగ్‌లోనే బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం హోటళ్లలో బస చేయాలంటే కస్టమర్లు భయపడుతున్నారని.. వారి భయాన్ని పోగొట్టడం కోసమే ఈ భీమాని తీసుకొచ్చామని ఈ హోటల్ సీఈవో చాన్‌ కాంగ్‌ లియాంగ్‌ చెప్పారు.

Also Read: మీ జీవిత చివరి అంకం త్వరగా ముగిసింది, సినిమా ఉన్నంత వరకూ మాతోనే ఉంటారన్న ఇర్ఫాన్ ఖాన్ భార్య