Puri About 2020: ‘అందరూ దాన్ని తిడుతున్నారు. కానీ… అది మనకు చాలా నేర్పింది’.. పూరీ మ్యూజింగ్స్ విన్నారా.?
Puri Musings: కొత్తేడాదిలోకి అడుగుపెడుతోన్న తరుణంలో చాలా మంది 2020ని తిడుతున్నారు. గడిచిన ఏడాది అంతా నష్టమే..
Puri Musings: కొత్తేడాదిలోకి అడుగుపెడుతోన్న తరుణంలో చాలా మంది 2020ని తిడుతున్నారు. గడిచిన ఏడాది అంతా నష్టమే.. ఏం బాగాలేదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే దీనికి పూర్తిగా భిన్నంగా స్పందించాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. మానవాళిని అతలాకుతలం చేసిన 2020 ఏడాదిపై తనదైన శైలిలో పొగడ్తల వర్షం కురిపించాడు. తనదైన పంచ్ డైలాగ్‌లతో ఆకట్టుకునే దర్శకుడు పూరీ జగన్నాథ్ గత కొంత కాలంగా ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో.. కొన్ని సామాజిక అంశాలపై తన ఆలోచనలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా 2020 ఏడాది గురించి పూరీ మ్యుజింగ్స్‌లో చర్చించాడు. ప్రస్తుతం పూరీ సంభాషణలు వైరల్‌గా మారాయి.
ఇంతకీ పూరీ ఇందులో ఏం చెప్పాడంటే.. ‘అందరూ 2020ని తిట్టుకుంటున్నారు. కానీ మన జీవితాల్లో ఇదే ఉత్తమమైన ఏడాది. ఈ సంవత్సరం మనకు చాలా నేర్పించింది. హెల్త్ ఎంత ముఖ్యమో.. ఇమ్యునిటీ (రోగనిరోధక శక్తి) అవసరం ఏంటో, మంచి ఆహారం విలువ ఏంటి లాంటి ఎన్నో విషయాలను నేర్పించింది. శుభ్రత గురించి తెలుసుకున్నాం.. పుట్టిన తర్వాత ఇన్ని సార్లు హ్యాండ్ వాష్ ఎప్పుడూ చేసుకోలేదు. చదువుకోని వారు కూడా వైరస్, న్యూట్రేషన్, శానిటైజర్, క్వారంటైన్, యాంటీ బాడీస్, ప్లాస్మా, స్ట్రెయిన్ ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. మొదట్లో నెలరోజులు లాక్‌డౌన్ అంటే పిచ్చి లేసినట్లయింది. దీంతో ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే.. మానసిక ఆరోగ్యం కూడా అవసరంమని తెలసుకున్నాం. డబ్బు ఉన్నా, లేకపోయినా.. ఎలా బతికామో, మనకే తెలియదు. నిజమైన స్నేహితులెవరో ఇప్పుడే తెలిసింది. జీవితంలో పొదుపు ఎంత ముఖ్యమో తెలిసొచ్చింది. ఇంటి నుంచి పనిచేయడం నేర్చుకున్నాం. ఆడవాళ్లు బంగారం, కొత్త చీరలు లేకుండా బతకడం ఎలాగో నేర్చుకున్నారు. అనవసరమైన షాపింగ్‌లు, చిరుతిళ్లు తగ్గించాం.. అవసరమైనవి మాత్రమే కొంటున్నాం’ అంటూ 2020 మానవాళికి చేసిన మేలు గురించి తనదైన యాంగిల్‌లో చెప్పుకొచ్చాడు. పూరీ జగన్నాథ్ చెబుతోన్న మాటలు వింటుంటే నిజమే అనిపిస్తోంది కదూ.?