AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీకి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లేఖ..అందులో ఏముందంటే..?

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే అది సినిమాల విషయంలో అయితే ఓకే కానీ ఏకంగా ప్రధాని మోదీకే లేఖ రాసి అందర్ని ఆశ్చర్యానికి గురి చేశారు.  పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారత్‌ను ప్లాస్టిక్‌ రహిత దేశంగా మార్చాలని, ఇందుకోసం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని బీజేపీ ఇప్పుడు మెయిన్ థీమ్‌గా ప్రచారం చేస్తుంది. అంతేకాదు ఇటీవల చైనా అధ్యక్షుడితో మహాబలిపురం […]

మోదీకి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లేఖ..అందులో ఏముందంటే..?
Ram Naramaneni
|

Updated on: Oct 21, 2019 | 12:58 AM

Share

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే అది సినిమాల విషయంలో అయితే ఓకే కానీ ఏకంగా ప్రధాని మోదీకే లేఖ రాసి అందర్ని ఆశ్చర్యానికి గురి చేశారు.  పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారత్‌ను ప్లాస్టిక్‌ రహిత దేశంగా మార్చాలని, ఇందుకోసం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని బీజేపీ ఇప్పుడు మెయిన్ థీమ్‌గా ప్రచారం చేస్తుంది. అంతేకాదు ఇటీవల చైనా అధ్యక్షుడితో మహాబలిపురం చర్చల సమయంలోనూ మోడీ బీచ్ లో ప్లాస్టిక్ ఏరుతూ ఆ వీడియోను పోస్టు చేశారు. అయితే తాజాగా టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ వాతవరణంలో వస్తున్న మార్పులకు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఒక్కటే కారణం కాదని.. దానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. ఈమేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సోషల్‌మీడియా వేదికగా ఒక లేఖ రాశారు.

”ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య వాతావరణ మార్పు. దీనికి చాలా కారణాలున్నాయి. అందులో ప్లాస్టిక్‌ కూడా ఒక కారణం. కేవలం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించినంత మాత్రాన పర్యావరణం బాగుపడదు. ప్లాస్టిక్‌ను ఒక్కసారి వాడిన తర్వాత దానిని ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల అది పర్యావరణానికి హానికారకంగా తయారవుతోంది.

ఉన్నట్టుండి ప్లాస్టిక్‌ని నిషేధిస్తే ఎకో ఫ్రెండ్లీ బ్యాగులు ఉపయోగించాలి. వాటిని ఉత్పత్తి చేయాలంటే ఎన్నో చెట్లు నాశనం అవుతాయి. దీనివల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతినే ప్రమాదముంది. ప్లాస్టిక్ వాడకం కన్నా.. వాహనాల నుంచి వచ్చే కాలుష్యమే అత్యంత ప్రమాదకరమైంది. ముందు దీనిని నివారించే చర్యలు చేపట్టండి.   వాతావరణ మార్పుల నుంచి మనం బయటపడాలంటే మొక్కలను ఎక్కువగా నాటాలి. భూమి మీద జనాభా పెరగడం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను గురించి అందరికీ అవగాహన కల్పించాలి.

ఒక్కసారి వాడిన ప్లాస్టిక్‌నే మళ్లీ, మళ్లీ వాడేలా చర్యలు తీసుకోవాలి. దీనిని గురించి ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌లను ఏర్పాటు చేసి ఒక్కసారి వాడిన ప్లాస్టిక్‌ను తీసుకువచ్చి ఇస్తే డబ్బులు ఇస్తామని ప్రకటిస్తే.. ప్రజలు వాడిన ప్లాస్టిక్‌ కవర్లను ఎక్కడపడితే అక్కడ పడేయ్యకుండా తీసుకువచ్చి ఆ కేంద్రాల్లో ఇస్తారు. ఇలాంటివి చేసినట్లు అయితే పర్యావరణాన్ని ప్లాస్లిక్‌ నుంచి కొంత వరకు కాపాడుకోవచ్చు.’ అని పూరీ పేర్కొన్నారు.