మారుమూల ప్రాంతాలకు విమాన కనెక్టివిటీ ఇవ్వగలిగాంః జీవీఎల్

ఉడాన్-ఉడే దేశ్ కీ ఆమ్ నాగరిక్ పేరుతో సామాన్యుడు కూడా విమాన ప్రయాణం చేసేలా దేశంలో గొప్ప పథకం అమలవుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో విమానయాన రంగం శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు.

మారుమూల ప్రాంతాలకు విమాన కనెక్టివిటీ ఇవ్వగలిగాంః జీవీఎల్
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 15, 2020 | 12:02 PM

ఉడాన్-ఉడే దేశ్ కీ ఆమ్ నాగరిక్ పేరుతో సామాన్యుడు కూడా విమాన ప్రయాణం చేసేలా దేశంలో గొప్ప పథకం అమలవుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో విమానయాన రంగం శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. గత ఆరేళ్ల కాలంలో ఈ రంగం 118% శాతం పురోగతిని సాధించిందన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఎయిర్‌క్రాఫ్ట్ సవరణ బిల్లుపై రాజ్యసభలో మాట్లాడారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-2 హయాంలో 54% శాతం మాత్రమే వృద్ది రేటు ఉండేదని గుర్తుచేశారు.

దేశీయ విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉందన్న నరసింహారావు.. అంతర్జాతీయ విమానయానంలో 4-5 స్థానాల్లో కొనసాగుతుందన్నారు. శరవేగంగా విమానయానం పెరుగుతున్న దేశాల్లో భారత్ మొదటిస్థానంలో ఉందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసుల అందించాలన్న సంకల్పంతో మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఇవ్వగలిగామని జీవీఎల్ స్పష్టం చేశారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం ర్యాంకింగ్ 65 నుంచి 34కు ఎగబాకడం గర్వించదగ్గ విషయమన్న జీవీఎల్.. విమానయానం దేశప్రజలకు అందుబాటు ధరలో, సురక్షిత, ఆనందదాయక ప్రయాణం కావాలని ప్రధాని ఆకాంక్ష అని స్పష్టం చేశారు. కేవలం కొన్ని ధనికవర్గాలకు మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలన్నదే ప్రధానరి అభిలాష అన్నారు. ఈ పరిస్థితుల్లో ఎయిర్‌క్రాఫ్ట్ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని జీవీఎల్ తెలిపారు. ఇప్పటి వరకు సర్వీసులే లేని విమానాశ్రయాలకు సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో వందే భారత్ మిషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చిన ఘనత కేంద్ర విమానయాన శాఖకే దక్కిందన్నారు.

విజయవాడ-కడప మార్గంలో కేవలం రూ. 800 చెల్లించి ప్రయాణం చేయగలిగే పరిస్థితి నెలకొందన్నారు. దేశీయ విమాన సర్వీసుల్లో థర్డ్ ఏసీ ట్రైన్ ధరతో విమానప్రయాణం చేయగలిగే పరిస్థితి ఏర్పడింది. 2024 నాటికి మరో 100 విమానాశ్రయాలను అందుబాటులోకి తేవాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.