ముడి చమురు(Crude Oil) ధర సోమవారం భారీగా పెరిగింది. దాదాపు 3 శాతం పెరిగి బ్యారెల్‌కు 111 డాలర్లకు చేరుకుంది. ముడి చమురు ధర పెరగడానికే రష్యా, ఉక్రెయిన్(Russia-Ukraine war) మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలే కారణంగా తెలుస్తుంది. వారం క్రితం ఇరు దేశాల మధ్య చర్చలు పురోగతిలో ఉన్నట్లు వార్తలు రావడంతో ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు తగ్గింది. అయితే మళ్లీ ఉద్రిక్తలు పెరగడంతో ముడి చమురు ధర పెరిగింది. ఉక్రెయిన్ రష్యా దాడులను ప్రతిఘటించడంతోపాటు ఉక్రెయిన్ ఉప ప్రధాన మంత్రి మారియుపోల్ లొంగిపోయే ప్రశ్నే లేదని చెప్పడంతో ఉద్రిక్తలు పెరిగాయి.
యుద్ధ విరమణ దిశగా ఎలాంటి పురోగతి లేకపోవడం.. ఇప్పటికే పలు దఫాల్లో జరిగిన చర్చలు విఫలం కావడంతో చమురు సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. చాలా దేశాలు ప్రత్యామ్నాయ వనరులను ఆశ్రయిస్తున్నప్పటికీ.. దీర్ఘకాలంలో యుద్ధం కొనసాగితే ఇబ్బందులు తప్పవన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో గతవారం 99 డాలర్లకు చేరిన బ్యారెల్ ముడి చమురు ధర మరోసారి 110 డాలర్లకు ఎగబాకింది.
ముడి చమురు ధర పెరగడంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 571.44 పాయింట్ల నష్టంతో 57,292.49 వద్ద ముగిసింది. 17,329.50 వద్ద ప్రారంభమైన నిఫ్టీ చివరకు 169.45 పాయింట్లు కోల్పోయి 17,117.60 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.76.17 వద్ద ట్రేడవుతోంది. ముడి చమురు ధర పెరుగుదలతో దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. టోకు మార్కెట్లో ఇప్పటికే లీటర్ డీజిల్ ధర రూ. 25 పెరిగింది.
Read also..Reliance Jio: ఇంటర్‌నెట్ వినియోగదారుల కోసం జియో రెండు సరికొత్త ప్లాన్స్.. పూర్తి వివరాలు..