AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#COVID2019 తిరుమల శ్రీవారి దర్శనాలకు కరోనా ఎఫెక్ట్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం తిరుమలేశునికి చేరుతోందా? పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది. ఇప్పటికే భక్తుల దర్శనాలను నియంత్రించిన టీటీడీ స్వామి వారికి కైంకర్యాలను మాత్రం కొనసాగిస్తూ.. భక్తుల దర్శనాలను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

#COVID2019 తిరుమల శ్రీవారి దర్శనాలకు కరోనా ఎఫెక్ట్
Rajesh Sharma
|

Updated on: Mar 18, 2020 | 3:01 PM

Share

Tirumala temple will be closed soon due to #covidindia ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం తిరుమలేశునికి చేరుతోందా? పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది. ఇప్పటికే భక్తుల దర్శనాలను నియంత్రించిన టీటీడీ స్వామి వారికి కైంకర్యాలను మాత్రం కొనసాగిస్తూ.. భక్తుల దర్శనాలను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి ఆగమ శాస్త్రం ఏ మాత్రం అభ్యంతరపెట్టదని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు చెబుతుండడం తిరుమలేశుని దర్శనాలు కొన్నాళ్ళపాటు ఆగిపోతాయన్న వాదనకు బలం చేకూరుస్తోంది.

కరోనా వ్యాప్తిని నియంత్రించాలంటే వచ్చే నెల రోజులు అత్యంత కీలకమని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో నిర్దిష్టమైన చర్యలకు యావత్ భారత దేశం రెడీ అవుతోంది. అందులో భాగంగా భారీగా జనసమ్మర్థం వుంటే ప్రాంతాలలో ఆంక్షలు విధిస్తున్నారు. సినిమా హాళ్ళు, మల్టిప్లెక్సులు, బార్లు, క్లబ్బులు, పబ్బులు ఇదివరకే చాలా రాష్ట్రాలలో నిరవధికంగా మూత పడ్డాయి. ఆ తర్వాత భారీగా భక్త జనం సంచరించే తిరుమల, షిరిడీ వంటి ఆలయాలవైపు దృష్టి మళ్ళింది. షిరిడీ దేవాలయాన్ని మంగళవారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. ఇటు తిరుమలలో గత మూడు రోజులుగా భక్తుల దర్శనాలను నియంత్రించారు. ఈ నెలాఖరు దాకా భక్తులు తిరుమల ప్రయాణాన్ని పెట్టుకోవద్దని టీటీడీ శ్రీవారి భక్తులను కోరింది.

తాజాగా తిరుమల ఆలయాన్ని కొన్ని రోజులపాటు కేవలం స్వామి వారి కైంకర్యాలకు మాత్రమే పరిమితం చేసి.. భక్తుల దర్శనాలను రద్దు చేయాలన్ని ప్రతిపాదన వస్తోంది. దీన్ని టీటీడీ అధికారులు పరిశీలస్తున్నట్లు సమాచారం. తాజాగా కరోనా ఎఫెక్ట్ పై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షతులు స్పందించారు. కరోనా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో స్వామి వారికి కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించి ఆలయాన్ని మూసి వేయొచ్చని ఆగమ శాస్త్రం చెపుతోందని ఆయనంటున్నారు. లోక కళ్యాణార్థం కళ్యాణోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించి, సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు జరిగే ఉపచారాలు ఆగమోక్తంగా నిర్వహిస్తామని ఆయన చెబుతున్నారు. సహస్ర కలశాభిషేకం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, విశేష పూజ ఇతర ఆర్జిత సేవలు రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లోక క్షేమార్థం ఆగమ శాస్త్రం ప్రకారం ఆస్థాన మండపంలో చతుర్వేద పారాయణ జపం 10 రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపిన వేణుగోపాల దీక్షితులు.. శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహా యాగం ధర్మగిరిలో మూడు రోజుల పాటు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తామని తెలిపారు. వేణుగోపాల దీక్షితులు మాటలే నిజమైతే.. త్వరలో కొన్ని రోజుల పాటు స్వామి వారి దర్శనం భక్తులకు దూరమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.

చిల్కూరు టెంపుల్‌లో దర్శనాలు బంద్

చిలుకూరు బాలాజీ దేవాలయం కోవిడ్19 వైరస్ (కరోనా వైరస్) కారణంగా రేపటి నుండి (మార్చ్19నుండి) 25వ తేదీ వరకు మూసివేయడం జరుగుతుందని.. స్వామి వారి ఆరాధన రోజూ కొనసాగిస్తామని కానీ భక్తులకు అనుమతి లేదని చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. చిలుకూరు బాలాజీ దేవాలయ పూజారి పవన్ మాట్లాడుతూ ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్ గోపాల కృష్ణ రంగరాజన్ ఆదేశాల మేరకు ఆలయం మూసివేత నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు అన్ని మూసి వేయడం జరిగిందని, అందుకే కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున చిల్కూరు ఆలయం మూసివేయడం జరుగుతుందని అన్నారు.