AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నూతన విద్యావిధానం వివేకానందుని ఆలోచనలకు ప్రతిబింబం’

సృజనాత్మకతతో కొత్త విషయాల కోసం నిరంతరం అన్వేషించేలా ప్రోత్సహించే విద్యావ్యవస్థ అత్యంత ఆవశ్యకమని తద్వారా భవిష్యత్ భారతాన్ని మరింత వైభవోపేతంగా మలచుకునే...

'నూతన విద్యావిధానం వివేకానందుని ఆలోచనలకు ప్రతిబింబం'
Ravi Kiran
| Edited By: |

Updated on: Sep 10, 2020 | 9:04 PM

Share

New Education System: సృజనాత్మకతతో కొత్త విషయాల కోసం నిరంతరం అన్వేషించేలా ప్రోత్సహించే విద్యావ్యవస్థ అత్యంత ఆవశ్యకమని తద్వారా భవిష్యత్ భారతాన్ని మరింత వైభవోపేతంగా మలచుకునే వీలవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. విజ్ఞానాణ్వేషణ కేంద్రంగానే 21వ శతాబ్దపు పోటీ ప్రపంచం నడుస్తోందన్న ఆయన పరిశోధనాత్మక ఆలోచనలను పెంపొందించే విధంగా విద్యాబోధన సాగాలని సూచించారు.

హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠ్ ఆధ్వర్యంలోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ 21వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. 1893 సెప్టెంబర్ 11న చికాగోలో సర్వమత సమ్మేళనాన్ని ఉద్దేశించి స్వామి వివేకానందుడు ప్రసంగించిన వేదిక ద్వారా రెండేళ్ల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా.. ప్రాచీన భారత వైదిక తత్వం, వసుధైవ కుటుంబక భావన, శాంతి, సహనం మొదలై ప్రాచీన భారత విధానాలను ప్రపంచానికి పరిచయం చేసిన అప్పటి వివేకానందుడి ప్రసంగాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. తన కళాశాల, విశ్వవిద్యాలయ రోజుల నుంచి స్వామి వివేకానందుడి పుస్తకాలను చదువుతున్నానన్న ఉపరాష్ట్రపతి.. మతం, ఆధ్యాత్మికత, జాతీయవాదం, విద్య, తత్వం, సామాజిక సంస్కరణలు, పేదరిక నిర్మూలన, ప్రజాసాధికారత వంటి అంశాల్లో స్వామిజీ బోధనలు తననెంతగానో ప్రభావితం చేశాయన్నారు.

స్వామి వివేకానంద భారతీయ ఆత్మను, సంస్కృతిని అవగతం చేసుకున్నారని.. సనాతన ధర్మం ఆధ్యాత్మిక పునాదులలో పొందుపరచిన గొప్ప ఆదర్శాలపై భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రయత్నించారని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ‘మతపరమైన, ఆధ్యాత్మిక మార్పులు, సామాజిక పునరుత్పత్తి ద్వారా దేశంలో పరివర్తన తీసుకొచ్చేందుకు వారు అవిశ్రాంతంగా శ్రమించారు’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. నాటి వివేకానందుడి ప్రసంగాల్లోని అంశాలు.. నేటి అధునిక ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాయని, అంతటి మహనీయమైన వ్యక్తి జీవితాన్ని, సందేశాలను యువత అధ్యయనం చేయడం ద్వారా తమ తమ జీవితాల్లో సానుకూల మార్పునకు బీజం వేసుకోవాలని ఆయన సూచించారు. వివేకానందుడి బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఆర్కే మఠ్, ఆర్కే మిషన్ వంటి మరిన్ని సంస్థల అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

21వ శతాబ్దపు డిమాండ్లకు అనుగుణంగా మన విద్యావిధానాన్ని పున:సమీక్షించుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని.. ఈ దిశగా నూతన జాతీయ విద్యావిధానం రూపంలో తీసుకొచ్చిన మార్పులు దేశాన్ని మరోసారి విశ్వగురువుగా మార్చే దిశగా మార్గదర్శనం చేసేలా ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. పాశ్చాత్య విజ్ఞానానికి, అమూల్యమైన భారతీయ వేదాంతాన్ని జోడించడం ద్వారా దేశం అత్యున్నత శిఖరాలను చేరుకునేందుకు అవకాశం ఉందన్నారు. భారతదేశానికి అదనపు బలమైన యువశక్తి ఈ దిశగా దృష్టిపెట్టి నైపుణ్యాన్ని పెంచుకుని, సృజనాత్మకతతో వినూత్న ఆవిష్కరణలతో దూసుకుపోవాలని సూచించారు. ఆవిష్కరణలు, పరిశోధనల ఏకైక లక్ష్యం మానవాళికి మేలు చేయడమే కావాలని కూడా ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.