ముంబయి ఎయిర్‌పోర్ట్‌పై కన్నేసిన అదానీ గ్రూప్..!
జీవీకే గ్రూపునకు చెందిన ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్ట్ అదానీ గ్రూపు చేతికి దక్కనున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో జీవీకే గ్రూపునకు చెందిన వాటాను కొనుగోలు చేయటానికి అదానీ గ్రూపు సంప్రదింపులు సాగిస్తున్నట్లు సమాచారం.
జీవీకే గ్రూపునకు చెందిన ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్ట్ అదానీ గ్రూపు చేతికి దక్కనున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో జీవీకే గ్రూపునకు చెందిన వాటాను కొనుగోలు చేయటానికి అదానీ గ్రూపు సంప్రదింపులు సాగిస్తున్నట్లు సమాచారం. ఎంఐఏఎల్‌లో ప్రస్తుతం జీవీకేకు 50.5% వాటా, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 26 శాతం వాటాలు ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, బిడ్‌వెస్ట్ గ్రూపు చేతిలో మిగిలిన వాటా ఉంది. గత ఏడాది మార్చిలో బిడ్‌వెస్ట్ గ్రూపు వాటాను కొనుగోలు చేయటానికి అదానీ గ్రూపు ప్రయత్నించింది. కానీ, ఆ ప్రయత్నాన్ని జీవీకే గ్రూపు అడ్డుకుంది. ఆ వాటా తానే కొనుగోలు చేస్తానని స్పష్టం చేసింది. కానీ అందుకు అవసరమైన సొమ్ము సమకూర్చులేకపోయింది. ఆ తర్వాత ఈ వ్యవహారం న్యాయస్థానం వరకూ వెళ్లింది.
మరోవైపు ఎంఐఏఎల్ నుంచి తన ఇతర కంపెనీల్లోకి జీవీకే గ్రూపు రూ.705 కోట్ల మేరకు నిధులు మళ్లించినట్లు ఆరోపిస్తూ సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంఐఏఎల్ నుంచి జీవీకే గ్రూపు వైదొలగదల్చుకున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఆ స్థానంలో అదానీ గ్రూపు పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదానీ గ్రూపు గత కొంతకాలంగా విమానాశ్రయాల వ్యాపార విభాగంలోకి ప్రవేశించింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇటీవల ఆరు నాన్-మెట్రో విమానాశ్రయాల నిర్మాణ- నిర్వహణ కాంట్రాక్టులను అదానీ గ్రూపు దక్కించుకుంది. తాజాగా దేశంలోని రెండో అతి పెద్దదైన ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సొంతం చేసుకునేందు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే జీవీకే- అదానీ గ్రూపు మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటనలు వెలువడే అవకాశమున్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.