భారీ వర్షాలను జాతీయవిపత్తుగా ప్రకటించాలిః కోమటిరెడ్డి
తెలంగాణలో బీభత్సాన్ని సృష్టించిన కుండపోత వర్షాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణలో బీభత్సాన్ని సృష్టించిన కుండపోత వర్షాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కనివినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి తెలంగాణ అతలాకుతలం అయ్యింది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలంటూ ట్విటర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. తక్షణ సహాయం కింద తెలంగాణ రాష్ట్రానికి రూ.2వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుండపోతగా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ నిండా మునిగిందని, జనజీవనం అస్తవ్యస్తం కావడంతో పాటు చేతి కొచ్చిన పంట నీట మునిగిందని కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించి.. తెలంగాణలో వర్ష బీభత్సంపై ఏరియల్ సర్వే నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అన్నదాత నిలువునా మునిగిపోయాడని పేర్కొన్నారు. చేతికొచ్చిన వరి, పత్తి సహా అన్ని పంటలు నీటిలో మునిగిపోవడంతో తెలంగాణ రైతాంగం ఆవేదన చెందుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టం అయ్యాయని, జాతీయ రహదారులతో పాటు ప్రధాన రహదారులు దెబ్బతిని రవాణా వ్యవస్థ స్తంభించిందని లేఖలో వివరించారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కచ్చితంగా జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.