పుట్టింటి నుంచి రావాల్సిన డబ్బుల కోసం భార్య, భర్తల మధ్య ఘర్షణ.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి ఆత్మహత్యయత్నం
ఆర్థిక ఇబ్బందులతో భర్తతో గొడవపడిన భార్య తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.
భార్య, భర్తల మధ్య ఘర్షణ ముగ్గురు ప్రాణాల మీదకు తెచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో భర్తతో గొడవపడిన భార్య తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నాగర్‌కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలకపల్లి మండలం గట్టు నెల్లికుదురు గ్రామానికి చెందిన మల్లేష్, మాధవి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే, సారేకు సంబంధించి మాధవి పుట్టింటి నుండి రావలసిన రూ.20వేల విషయంలో మల్లేష్ భార్యతో శుక్రవారం ఘర్షణ పడ్డాడు. భర్త మల్లేష్ వ్యవసాయానికి పొలానికి వెళ్ళిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాధవి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన 2 ఏళ్ల కుమారుడు నందు, 6 నెలల పాప మమతకు పురుగుల మందు ఇచ్చి తానూ సేవించింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో.. వెంటనే వారిని 108 వాహనంలో నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారని, తల్లి మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.