గల్వాన్‌ వీరులకు స్మారక చిహ్నం.. కల్నల్ సంతోష్‌ బాబుకు గౌరవం

లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో జూన్‌ 15న చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి అమరులైన 20 మంది భారత జవాన్లకు భారత సైన్యం స్మారక చిహ్నాన్ని నిర్మించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

గల్వాన్‌ వీరులకు స్మారక చిహ్నం.. కల్నల్ సంతోష్‌ బాబుకు గౌరవం
Follow us

|

Updated on: Oct 04, 2020 | 5:04 PM

లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో జూన్‌ 15న చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి అమరులైన 20 మంది భారత జవాన్లకు భారత సైన్యం స్మారక చిహ్నాన్ని నిర్మించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తూర్పు లడఖ్‌లోని 120వ పోస్ట్ వద్ద నిర్మించిన ఈ మెమోరియల్‌ను ఇటీవలే ప్రారంభించినట్టు వారు తెలిపారు. గల్వాన్ వీరులు(గ్యాలంట్స్ ఆఫ్ గల్వాన్)పేరుతో ఈ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ‘‘స్నో లెపర్డ్‌(మంచు చిరుత)’’ పేరుతో నిర్వహించిన సైనిక చర్యలో భాగంగా చైనా బలగాలతో బాహాబాహీ తలపడి, వారిని తరిమిన తీరును, ఆ క్రమంలో మృతి చెందిన గల్వాన్‌ అమరవీరుల పరాక్రమాన్ని, ఈ స్మారక చిహ్నం శిలాఫలకంపై ప్రస్తావించారు.

గల్వాన్ లోయలో వాస్తవాధీనరేఖ వెంట 14వ పెట్రోలింగ్ పాయింట్ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఈ ఏడాది జూన్ 15న జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఆరోజు జరిగిన ఘర్షణలో కల్నల్ బి.సంతోష్‌బాబు నేతృత్వంలోని బీహార్ రెజిమెంట్ వీరోచితంగా పోరాడింది. చైనా సైనికులు ఏకపక్షంగా నిర్మించిన చెక్‌పోస్ట్‌ను ధ్వంసం చేసింది. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు’’ అని సైన్యం ఆ ఫలకం పై రాసింది. గల్వాన్‌లో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌ బాబు, ముగ్గురు నాయబ్‌ సుబేదార్లు, ముగ్గురు హవల్దార్లు, 12 మంది సిపాయిల పేర్లను దీనిపై రాశారు.