హమ్మయ్యా..ఎట్టకేలకు మ్యాన్ ఈటర్ కథ ముగిసింది! ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు.. ఎలా పట్టుకున్నారంటే..
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో గత కొన్ని రోజులుగా గ్రామీణ ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఒక నరభక్షక పులి (మ్యాన్ ఈటర్) కథ ఎట్టకేలకు ముగిసింది. చిమూర్ తాలూకా తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ పరిధిలోని పాలస్‌గావ్ అటవీ రేంజ్ కంపార్ట్‌మెంట్ నంబర్ 558లో సంచరిస్తున్న బెబ్బులిని అటవీ శాఖ అధికారులు విజయవంతంగా బంధించారు.

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా చిమూర్ తాలుకాలో మనుషులపై దాడి చేస్తున్న బెబ్బులిని సర్చ్ ఆపరేషన్ చేపట్టి మత్తుమందు ఇచ్చి ఎట్టకేలకు బందించారు అటవిశాఖ అదికారులు. తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ పరిధిలోని పాలస్‌గావ్ అటవీ ప్రాంతంలో ఓ మహిళను బెబ్బులి హతమార్చడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చేపట్టడంతో రంగం లోకి దిగిన అటవిశాఖ అదికారులు సర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
మూడు రోజులుగా శ్రమించి ఎట్టకేలకు చిమూర్ తాలూకాలోని పాలస్‌గావ్ అటవీ రేంజ్ పరిధిలోని కంపార్ట్‌మెంట్ నంబర్ 558లో అక్టోబర్ 30న ఈ ఆపరేషన్ ను విజయవంతం చేశారు. చంద్రపూర్ జిల్లా వన్యప్రాణి విభాగం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ అనుమతితో రంగంలో కి దిగిన అటవీశాఖ ప్రత్యేక బృందం 72 గంటల పాటు శ్రమించి మ్యాన్ ఈటర్ ను బందించారు. పట్టుబడ్డ బెబ్బులి T-179 SM1 అనే మగపులిగా గుర్తించారు. చంద్రపూర్ ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్ ప్రధాన పశువైద్యాధికారి డాక్టర్ కుందన్ పోస్చల్వార్ నేతృత్వంలో పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి సురక్షితంగా పులిని బంధించారు. అనంతరం పులిని చంద్రపూర్‌లోని ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించనున్నారు.
ఇటీవల పాలస్‌గావ్ ప్రాంతానికి చెందిన ఉషా గురునులే అనే మహిళపై దాడి చేసి హతమార్చింది T-179 SM1 అనే మగపులి. ఈ దాడి ఘటనతో స్థానికుల నుండి అటవిశాఖ కు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. స్థానికుల డిమాండ్ నేపథ్యంలో సర్చ్ ఆపరేషన్ చేపట్టిన అటవిశాఖ విజయవంతంగా పులిని బందించడంతో.. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరో వైపు ఇదే జిల్లాలో నిన్న అక్టోబర్ 30న ఒకే రోజు మూడు పులులు.. ముగ్గురిని హతమార్చడంతో మహారాష్ట్ర సర్కార్ పై పులి బాదిత గ్రామాల నుండి తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. అటవిశాఖ సైతం మ్యాన్ఈటర్ లను బందించేందుకు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉంది. తాజాగా అక్టోబర్ 25 మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సావిలీ తాలూకా అటవీ ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు పశువుల కాపరులు, ఇద్దరు రైతులను పొట్టన పెట్టుకున్న నరభక్షక పులిని అటవిశాఖ మత్తు మందు ఇచ్చి బందించింది. పట్టుబడ్డ పులిని టీ-122 పులిగా గుర్తించింది అటవిశాఖ. చంద్రపూర్ జిల్లా అటవిశాఖ లెక్కల ప్రకారం చిమూర్ తాలూకా గరడాపార్ , సిందేవాహి తాలూకా ధుమన్‌ఖేడా, పోంభూర్ణ తాలూకా సాతారా పరిదిలో మరో నాలుగు మ్యాన్ఈటర్ ల సంచారం కొనసాగుతున్నట్టు సమాచారం. వాటిని అటవిశాఖ అదికారికంగా దృవికరించాల్సి ఉంది.




