AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిల నుంచి అండాలు.. అబ్బాయిల నుంచి వీర్యకణాలు.. హాస్టళ్లల్లో సరికొత్త దందా..!

హైదరాబాద్‌లోని బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో గర్ల్స్ హాస్టల్ పేరుతో అండాల సేకరణ వ్యవహారం సాగుతున్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 10 మంది యువతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అండాల సేకరణకు సంబంధించిన నిబంధనలు పాటించారా? ఫెర్టిలిటీ కేంద్రాలతో సంబంధాలున్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మాయిల నుంచి అండాలు.. అబ్బాయిల నుంచి వీర్యకణాలు.. హాస్టళ్లల్లో సరికొత్త దందా..!
Hyderabad Egg Donation Case
Shaik Madar Saheb
|

Updated on: Oct 31, 2026 | 9:00 AM

Share

అది పేరుకే లేడీస్‌ హాస్టల్‌.. చేసేది అండాల బిజినెస్‌.. బేగంపేట ప్రకాష్‌నగర్‌లో బయటపడ్డ అండాల అక్రమ దందా.. హైదరాబాద్‌లో గర్ల్స్‌ హాస్టల్‌ పేరుతో నడుపుతున్న గలీజ్‌ దందా గుట్టురట్టు అయింది. బేగంపేటలో యువతుల అండాల సేకరణ ముఠా వ్యవహారం బట్టబయలు అయింది. బేగంపేట పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసుల సంయుక్తంగా దాడుల్లో 10మంది యువతులు అడ్డంగా బుక్కవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌ బేగంపేటలో యువతుల అండాల అక్రమ సేకరణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రకాష్‌నగర్‌లోని నజ్రాన్‌ అపార్ట్‌మెంట్‌లో గలీజ్‌ వ్యవహారం సాగుతున్నట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో బేగంపేట పోలీసులు, ఎస్‌ఓటీ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ దారుణ వ్యవహారం బయటపడింది. పోలీసులకు 10మంది యువతులు పట్టుబడటం సంచలనం రేపింది. వీరిని బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశాకు చెందిన యువతులుగా గుర్తించి.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పురుషుల వీర్యకణాల సరఫరా దందాపైనా పోలీసుల ఫోకస్‌

బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో ఏడాదికాలంగా అమీ నీతా గర్ల్స్‌ హాస్టల్‌ పేరుతో ఈ అక్రమ అడ్డగోలు కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలోనే.. అండాల సేకరణతో పాటు సంతాన సాఫల్య కేంద్రాలతో సంబంధాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతుల నుంచి అండాలను సేకరించి సమీపంలోని సంతాన సాఫల్య కేంద్రాలకు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళల అండాలతో పాటు పురుషుల వీర్యకణాల సరఫరాకు సంబంధించిన దందాపైనా పోలీసులు ఫోకస్‌ పెట్టారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఓ మహిళ ప్రమేయం ఉందనే అనుమానంతో ఆమెను కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే.. అండాల అక్రమ సేకరణ, విక్రయాల వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. అండాల సేకరణలో యువతుల సమ్మతి ఉందా?.. డోనర్స్‌ విషయంలో అసలు మెడికల్ రూల్స్‌ పాటిస్తున్నారా?.. అండాల సరఫరా వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు?.. ఈ అండాలను ఏఏ ఫెర్టిలిటీ సెంటర్లకు పంపుతున్నారనే వివరాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.

అంతా బయట రాష్ట్రాల యువతులే..

ఇక.. ప్రకాశ్‌నగర్‌లోని అమీ నీతా గర్ల్స్‌ హాస్టల్‌లో ఎప్పటినుంచో చాలా మంది మహిళలు ఉంటున్నారని స్థానికులు చెప్పారు. అంతా బయట రాష్ట్రాల యువతులేనని తెలిపారు. అర్థరాత్రి సమయంలో ఇంటి పక్కన అపార్ట్‌మెంట్లో పోలీసులు దాడులు చేయడంతో ఆందోళనకు గురయ్యామన్నారు స్థానికులు. తీరా చూస్తే.. కొంతమంది యువతులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసిందని చెప్పారు. మొత్తంగా.. హైదరాబాద్‌లో మరోసారి అండాలు, వీర్యకణాల అక్రమ సేకరణ దందా గ్యాంగ్‌ గుట్టు రట్టయింది. గర్ల్స్ హాస్టల్ పేరుతో యువతుల అండాలను సేకరించి.. ఫెర్టిలిటీ సెంటర్లకు విక్రయిస్తున్న ముఠా బండారాన్ని బేగంపేట పోలీసులు బట్టబయలు చేయడం సంచలనంగా మారింది.

Follow Us