జీన్స్, టీ షర్ట్ వేసుకుంటే అంతే సంగతులు.. ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన మహా సర్కార్
మహారాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వస్త్రాధారణపై ఆంక్షలు విధించింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులు జీన్స్, టీషర్ట్, స్లిప్పర్స్ ధరించడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఉద్దవ్ ఠాక్రే సర్కార్ డిసెంబర్ 8న ఉత్తర్వులు జారీ చేసింది.
మహారాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వస్త్రాధారణపై ఆంక్షలు విధించింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులు జీన్స్, టీషర్ట్, స్లిప్పర్స్ ధరించడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఉద్దవ్ ఠాక్రే సర్కార్ డిసెంబర్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రాలనే ధరించాలని సర్కారు సర్క్యులర్ విడుదల చేసింది. డ్రెస్ కోడ్ అమలులో భాగంగా ఉద్యోగులెవరూ విధి నిర్వహణలో డీప్, వింత వింత రంగుల్లో ఎంబ్రాయిడరీతో ఉన్న దుస్తులు, రంగుల చిత్రాలు ఉన్న దుస్తులు ధరించరాదని స్పష్టం చేసింది.
మహిళా ఉద్యోగులు శారీ, సల్వార్, చుడీదార్-కుర్తా లేక కుర్తా-ప్యాంటు లేక షర్ట్ ధరించాలని, అవసరమనకుంటే దుపట్టా ధరించవచ్చని ఉత్తర్వుుల్లో పేర్కొంది. పురుషులు తప్పనిసరిగా ప్యాంట్లు, షర్ట్స్ ధరించాలని వెల్లడించింది. స్లిప్పర్స్‌కు బదులు చెప్పల్స్, శాండిల్స్ లేక షూస్ ధరించవచ్చని స్పష్టం చేసింది. ఇక చేనేత కార్మికులను పోత్సహించే ఉద్దేశంతో… ఉద్యోగులు వారంలో ఒకసారి ఖాదీ దుస్తులను ధరించవచ్చని పేర్కొంది. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు పద్ధతిగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. దుస్తులను బట్టి పని విధానం ఆధారపడుతుందని తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా మందికి అదొక విహార ప్రదేశం. ఎప్పుడు వెళ్లినా.. అసలు వెళ్లినా లేకున్నా అడిగేవాళ్లే ఉండరు. రావడం ఆలస్యంగా వస్తారేమో గానీ వెళ్లడం మాత్రం టైం టేబుల్ ప్రకారం వెళ్తారు. ఇక వస్త్రధారణ వారి ఇష్టం. ప్రైవేట్ కంపెనీలలో అయితే.. చాలా మట్టుకు ప్రొఫెషనల్ గా ఉండాలని.. అందరూ వృత్తి పరమైన విధానంగా నడుచుకోవాలని స్పష్టమైన ఆదేశాలుంటాయి. ముఖ్యంగా క్లయింట్లతో, మరో సంస్థల ప్రతినిధులతో సమావేశాలు, మాట్లాడేప్పుడు వారి లుక్ ఎంతో కీలకం. ప్రభుత్వ ఉద్యోగులలో పెద్ద స్థాయిలో ఉండేవారికి తప్ప.. కింది స్థాయిలో ఉండే వాళ్లివేవీ పట్టించుకోరు. కానీ ఇకనుంచి అలా కుదరదంటుంది మహా సర్కారు. ఉద్యోగులు కచ్చితంగా డ్రెస్ కోడ్ పాటించాల్సిందే.
మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలు పలువురికి షాకిచ్చాయి. జీన్స్, టీ షర్టులతో ఆఫీసుకు రావొద్దని.. అలా వస్తే అందుకు తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందుకు సంబంధించిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతున్నది.
ఉద్యోగులంతా ఆఫీసులో ప్రొఫెషనల్ గా కనిపించాలని.. ఆఫీసుల్లో జీన్స్, టీ షర్టుల వంటివి వేసుకోరాదని మహా సర్కారు ఆదేశించింది. ముఖ్యంగా సచివాలయం లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది.. తప్పకుండా ఈ నియమాలు పాటించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అంతేగాక చేనేత వస్తువులను ప్రోత్సహించే ఉద్దేశంతో.. ఉద్యోగులు సంప్రదాయ వస్త్రధారణలో వస్తే మరీ మంచిదని సూచించింది. మహిళలైతే.. చీరలు, సల్వార్లు, చుడీదార్స్, కుర్తాలను ధరించవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చేయడం కొత్తేం కాదు. అంతకుముందు బీహార్, కర్నాటక, తమిళనాడు కూడా ఇలాంటి ఉత్తర్వులే జారీ చేశాయి. ఇవేకాక, 2013 లో కర్నాటక, 2017 లో హిమాచల్ ప్రదేశ్, 2018 లో రాజస్థాన్ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేశాయి. గతేడాది తమిళనాడు ప్రభుత్వం సైతం రాష్ట్ర ఉద్యోగులంతా సంప్రదాయ వస్త్రాల్ని ధరించాలని డ్రెస్‌కోడ్ ప్రవేశపెట్టింది. సెక్రటేరియట్‌లో పనిచేసే పురుష ఉద్యోగులు షర్టు, ఫార్మల్ ఫ్యాంట్లు, మహిళా ఉద్యోగులు చీర లేదంటే దుపట్టాతో ఉన్న చుడీదార్.. సల్వార్ కమీజ్‌లు ధరించాలన్న ఆదేశాలు జారీ చేశారు.ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు.. అందుకు తగ్గట్లే హుందాగా వస్త్రధారణ ఉంటే బాగుంటుందని పేర్కొంది.
గతంలోనూ అయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు అనువుకాని, శుభ్రతలేని దుస్తులు ధరించడం వల్ల దాని ప్రభావం పనిపైనా పడుతోందని అభిప్రాయంతో డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2017 ఆగస్టులో ఆ రాష్ట్ర ఉద్యోగులకు డ్రెస్ కోడ్ విధించింది. హైకోర్టు నిర్దేశకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకు వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు కాజువల్ దుస్తులు వేసుకు రావడం పట్ల ఆ రాష్ట్ర హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు యూనిఫాం తప్పనిసరి చేస్తూ జీవో పాస్ చేసింది. ఫార్మల్, డీసెంట్ కన్పించే, అంతగా కొట్టొచ్చినట్లు కనిపించే రంగులు వద్దని ఆదేశించింది. ఉదారంగు, కంటికి ఆహ్లాదాన్ని కలిగించే దుస్తులను మాత్రమే ధరించాలని పేర్కొంది. జీన్స్, టీ షర్ట్స్ వచ్చిన నీటి పారుదల, ప్రజారోగ్య విభాగం డిపార్ట్ మెంట్ కు చెందిన మహిళా ఇంజినీర్ పై హైకోర్టు సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ఈ డ్రెస్ కోడ్‌ను అమలులోకి తీసుకువచ్చింది రాష్ట్ర సర్కార్.
ఇక, గతంలోనూ రాజస్థాన్ రాష్ట్రంలో ఇదే అంశానికి సంబంధించిన రచ్చ జరిగింది. 2018 జూన్ లో రాజస్థాన్ స్టేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉద్యోగులు జీన్స్, టీ షర్ట్స్ తదితర దుస్తులు వేసుకోవడం పట్ల అభ్యంతరం తెలిపారు. లేబర్ డిపార్ట్ మెంట్ తన ఉద్యోగులు తప్పనిసరిగా డీసెంట్ గా కన్పించే దుస్తులు ధరించాలని లేబర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆఫీస్ విధులకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సాధారణమైన ప్యాంట్, చొక్కా ధరించి రావాలని ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. అయితే, రాజస్థాన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు గజేంద్ర సింగ్ ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. జీన్స్, టీ షర్ట్స్ దుస్తులు ధరిస్తే అమర్యాదగా ఉంటాయని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యయుతంగా తమ నిరసన తెలుపుతామని వెల్లడించారు.
అటు, కేరళ రాష్ట్ర సర్కార్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2007లో కేరళ ప్రభుత్వం ఖాదీ, చేనేత పరిశ్రమల ఉత్పత్తులకు ప్రజాదరణ చేకూర్చే ఆలోచనతో ఈ నిబంధనలు తీసుకువచ్చింది. అయితే, ప్రతి శనివారం మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు ఖాదీ, చేనేత దుస్తులను ధరించి కార్యాలయాలకు రావాలని సూచించింది. కాగా, ఈ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలన్న నిబంధన విధించలేదు. అటు విద్యార్థులకు కూడా వారంలో ఒక రోజు ఖాదీ యూనిఫార్మ్ ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కేరళ ప్రభుత్వం భావించింది. 2018 మార్చిలో ఆదాయపు పన్నుశాఖ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసింది కేరళ సర్కార్. శుభ్రమైన, కంటి కి ఇంపైన, ఫార్మల్ దుస్తులు వేసుకు రావాలని కేంద్ర ఆదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు చేశారు. మొత్తం ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాటించాలని పేర్కొన్నారు.
గతేడాది బీహార్ ప్రభుత్వం.. ఉద్యోగులంతా క్రమశిక్షణగా ఉండాలని.. అందరూ డ్రెస్ కోడ్ ను విధిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. 2019 ఆగస్టు నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మర్యాద, గౌరవం పెంచడానికి ఉద్యోగులకు డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి చేసింది. టీ షర్ట్స్, జీన్స్ వేసుకొని కార్యాలయాలకు రావడం పై నిషేధం విధించి నితీష్ కుమార్ సర్కార్. అన్ని ర్యాంకుల ఉద్యోగులు సౌకర్యంగా ఉండే, సింపుల్, లైట్ కలర్ దుస్తులు వేసుకు రావాలని సూచించింది. ఈ ఆదేశాలు తప్పనిసరి పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది బీహార్ రాష్ట్ర ప్రభుత్వం.
కర్నాటక రాష్ట్ర సర్కార్ కూడా 2013 నుంచి ఉద్యోగులకు డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి చేసింది. మహిళా ఉద్యోగులు చీర, చుడీదార్, డీసెంట్ గా కన్పించే దుస్తులు ధరించాలని ఆదేశించింది. పురుష ఉద్యోగులు జీన్స్, టీ షర్ట్స్ ధరించకూడదని ఆదేశించింది. ఫార్మల్ ప్యాంట్, షర్ట్ మాత్రమే ధరించి కార్యాలయాలకు రావాలన్న నిబంధనను విధించింది. అటు అసోం.. 2017 మే నుంచి ఉద్యోగులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి అనే నిబంధనను తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెల మొదటి, మూడో శనివారం డ్రెస్ కోడ్ విధించాలని నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు రాని అధికారికంగా ఆదేశాలు జారీ కాలేదు. పురుషులకు దోతీ-కుర్తా, మహిళా ఉద్యోగినులకు చాదర్-మేఖలా ధరించాలని సిఫారసు చేసింది. అయితే, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల వ్యతిరేకత వల్ల డ్రెస్ కోడ్ పూర్తిగా అమలుకాలేదు.
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సచివాలయాల్లో పనిచేసేవారు ప్రత్యేకంగా కనిపించాలన్న ఆలోచనతో ఏపీ ప్రభుత్వం వారికి డ్రస్ కోడ్ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పైలెట్ సచివాలయాల కింద కొన్నింటిని గుర్తించి ముందుగా అక్కడి సిబ్బందికి డ్రస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయించింది.అక్కడి సిబ్బంది నుంచి, ఆ సచివాలయాల పరిధిలోని ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను ఆధారం చేసుకొని మిగిలిన సచివాలయాల్లో కూడా అమలుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.