కాంగ్రెస్, బీజేపీలకు కీలకంగా మారిన మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికలు

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలే కాదు.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న ఉప ఎన్నికలు కూడా ఆసక్తి రేపుతున్నాయి.. నిజానికి ఉప ఎన్నికలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు..

కాంగ్రెస్, బీజేపీలకు కీలకంగా మారిన మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికలు
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 03, 2020 | 12:26 PM

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలే కాదు.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న ఉప ఎన్నికలు కూడా ఆసక్తి రేపుతున్నాయి.. నిజానికి ఉప ఎన్నికలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు.. రాజకీయపార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవు.. కాని మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు ఆసక్తిని, ఉత్కంఠతను రేపుతున్నాయి. కారణం ఈ ఎన్నికలలో విజయం సాధించడం బీజేపీకి ఎంత అవసరమో, అంతకంటే ఎక్కువ కాంగ్రెస్‌కు అవసరం. కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ సర్కార్‌పై తిరుగుబాటు చేసి.. బీజేపీలో చేరిన పాతిక మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కూడా కీలకమే! తదనంతరం కమల్‌నాథ్‌ సర్కార్‌ మైనారిటీలో పడటం, ఆ ప్రభుత్వం కుప్పకూలడం తెలిసిన విషయాలే!

ఆ 25 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వీటితో పాటు మరో మూడు స్థానాలను కలుపుకుని మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇందులో తొమ్మిదింటిలో బీజేపీ గెలిస్తే శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వానికి ఢోకా ఉండదు.. లేకపోతే ఆ ప్రభుత్వం కూడా మైనారిటీలో పడే అవకాశం ఉంది.. అందుకే కాంగ్రెస్‌ కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. దెబ్బకు దెబ్బ తీయాలనే పంతంతో ఉంది. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు కూడా ఈ ఎన్నికలు కీలకమైనవే! ఆయన మాట విని బీజేపీలో చేరిన వారిని గెలిపించుకునే బాధ్యత ఆయనపై ఉంది. కాంగ్రెస్‌లో తనకు ప్రాధాన్యత లేదని కినుక వహించి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా తన పూర్వాశ్రమపు పార్టీని గట్టిగా దెబ్బ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు.

అందుకే అహర్నశమూ కష్టపడ్డారు.. ప్రచార బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయంగా మారాయి. ఏదో మిరాకిల్‌ జరిగి కాంగ్రెస్‌ గంపగుత్తగా 28 స్థానాలు గెలిచిందే అనుకుందాం! అప్పుడైనా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా అంటే అనుమానామే! ఇప్పుడున్న సీట్ల సంఖ్యను బట్టి మ్యాజిక్‌ ఫిగర్‌కు కాంగ్రెస్‌ మరో అడుగుదూరంలో ఉంటుంది.. ఇండిపెండెంట్ల మద్దతుతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న గట్టి నమ్మకంతో కమల్‌నాథ్‌ ఉన్నారు. కమల్‌నాథ్‌ ఆశలు నెరవేరుతాయా? జ్యోతిరాదిత్య సింధియా అనుకున్నది సాధిస్తారా? శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం బలోపేతమవుతుందా? చూడాలి మరి!