Chang’e 4 Mission : చికటి నుంచి వెలుగులోకి చాంగే-4 ల్యాండర్.. పరిశోధనలు మళ్లీ షురూ
చంద్రుడిపై డ్రాగన్ కంట్రీ చేస్తున్న పరిశోధనలు మరింత ఊపందుకున్నాయి. గతంలో ప్రయోగించిన చాంగే-4 ల్యాండర్, రోవర్‌లు తిరిగి పనిని మొదలు పెట్టాయి.
Chang’e 4 Mission : చంద్రుడిపై డ్రాగన్ కంట్రీ చేస్తున్న పరిశోధనలు మరింత ఊపందుకున్నాయి. గతంలో ప్రయోగించిన చాంగే-4 ల్యాండర్, రోవర్‌లు తిరిగి పనిని మొదలు పెట్టాయి. ఆ ప్రాంతంలో 14 రోజుల పగటి సమయం ఆరంభం కావడంతో అవి నిద్రాణ స్థితి నుంచి బయటకు వచ్చాయి.
చాంగే-4 వ్యోమనౌక 2019 జనవరి 3న చంద్రుడి ఆవలి భాగంలోని దక్షిణ ధ్రువంలో దిగింది. అక్కడి అయిట్కెన్ బేసిన్‌లో పరిశోధనలు సాగిస్తోంది. 736 రోజుల పాటు దాని ప్రస్థానం కొనసాగింది. అటువైపు ఉన్న చంద్రుడి ఉపరితలం ఎన్నడూ భూమి నుంచి కనిపించదు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3.13 గంటలకు ల్యాండర్ క్రియాశీలమైంది.
ఉదయం 10.29 గంటలకు యుతు-2 రోవర్ పనిచేయడం ప్రారంభించింది. ఇది చంద్రుడి ఉపరితలంపై వాయవ్య దిశగా తన పనిని కొనసాగిస్తోంది. గ్రహశకలాల ఢీ వల్ల ఏర్పడ్డ బసాల్ట్ శిల ప్రాంతంలోకి వెళ్లనుంది. ఆ ప్రాంతాన్ని కెమెరాతో క్లిక్‌మనిపిస్తుంది. పరారుణ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, న్యూట్రల్ ఆటమ్ డిటెక్టర్, లూనార్ రాడార్‌ల సాయంతో శాస్త్రీయ పరిశోధనలు సాగిస్తుంది. చంద్రుడిపై పగటి సమయం 14 రోజులు ఉంటుంది. అలాగే రాత్రివేళ అదే గ్యాప్ కలిగి ఉంటుంది. ఈ లెక్కన చాంగే-4కు ఇది 26వ రోజు.