AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెప్పపాటులో అంతా తలకిందులు.. లోయలోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు దుర్మరణం!

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దచ్ఛన్ ప్రాంతంలో శనివారం (ఆగస్టు 15) ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఓ బొలెరో వాహనం అదుపుతప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఉధృతంగా ప్రవహిస్తున్న చెనాబ్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. నదిలో చిక్కుకున్న మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

రెప్పపాటులో అంతా తలకిందులు.. లోయలోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు దుర్మరణం!
Car Falls Into Chenab River
Balaraju Goud
|

Updated on: Aug 15, 2026 | 3:57 PM

Share

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దచ్ఛన్ ప్రాంతంలో శనివారం (ఆగస్టు 15) ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఓ బొలెరో వాహనం అదుపుతప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఉధృతంగా ప్రవహిస్తున్న చెనాబ్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. నదిలో చిక్కుకున్న మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. డాంగ్‌దారు ప్రాంతంలోని యాన్వాన్ నుంచి సౌందర్ వైపు మహీంద్రా బొలెరో (HR29AG-0648) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉదయం సుమారు 10:45 గంటల సమయంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అది రహదారి నుంచి పక్కకు దూసుకెళ్లింది. అనంతరం లోతైన లోయలోకి పలుమార్లు బోల్తా పడుతూ చెనాబ్ నదిలోకి జారిపోయింది.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం దచ్ఛన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ప్రత్యేక బృందం, డైవర్లు, ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, స్థానికులు కలిసి నదిలో విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు.

అయితే బొలెరోలో ప్రమాద సమయంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. వెలికితీసిన మృతదేహాలను కూడా అధికారికంగా గుర్తించాల్సి ఉంది. చెనాబ్ నదిలో ప్రవాహం ఉధృతంగా ఉండటంతో సహాయక, వెలికితీత చర్యలు క్లిష్టంగా మారాయి. మరికొందరు గల్లంతై ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమా, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడానికి మరేదైనా కారణం ఉందా, వాహనంలో సాంకేతిక లోపం ఏర్పడిందా లేదా రహదారి పరిస్థితులు ప్రమాదానికి దారితీశాయా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కిష్త్వార్, దచ్ఛన్ వంటి పర్వత ప్రాంతాల్లో ఇరుకైన రహదారులు, లోతైన లోయలు, వాతావరణ పరిస్థితులు వాహనదారులకు సవాళ్లు విసురుతుంటాయి. గతంలోనూ ఈ ప్రాంతంలో వాహనాలు లోయల్లోకి జారిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతుండగా.. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు, వాహనంలో ఉన్న ప్రయాణికుల సంఖ్యపై అధికారులు మరింత సమాచారం వెల్లడించాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us