సవాల్ చేసి.. చతికిల పడి.. కేజ్రీవాల్ డోల్ డ్రమ్స్
వ్యవసాయ రంగానికి, చిన్నపాటి పరిశ్రమలకు మినహాయింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా దుకాణాలను తెరచుకునే విషయంలోనూ మరి కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఈ నిర్ణయంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు విభేధిస్తున్నాయి.

కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో విధించిన లాక్ డౌన్.. కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య చిచ్చు రేపుతోంది. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం లాక్ డౌన్ నిబంధనలకు కొంతమేర సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో వాటిని అమలు చేసేందుకు పలు రాష్ట్రాలు విముఖత చూపుతున్నాయి. ఏప్రిల్ 20వ తేదీ నుంచి లాక్ డౌన్ ఆంక్షలలో కేంద్రం కొన్ని సడలింపులు తెచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా సడలింపు ఇవ్వబోమని కేంద్రానికి గతంలోనే తేల్చి చెప్పాయి. అయితే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం పొద్దున్న ఓ మాట చెబితే.. సాయంత్రానికి ఇంకో విధానాన్ని అమలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఏప్రిల్ 20వ తేదీ తర్వాత కూడా కేంద్రం లాక్ డౌన్ నిబంధనల్లో ప్రతిరోజు కొన్ని మార్పులను చేస్తూ వస్తున్నది. ముందుగా వ్యవసాయ రంగానికి, చిన్నపాటి పరిశ్రమలకు మినహాయింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా దుకాణాలను తెరచుకునే విషయంలోనూ మరి కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఈ నిర్ణయంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు విభేధిస్తున్నాయి. ఈ కోవలోకి ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేరిందని శనివారం (ఏప్రిల్ 25వ తేదీ) ఉదయం కనిపించింది. కేంద్రం చెప్పిన సడలింపులను ఢిల్లీలో అమలు చేయబోమని కేజ్రీవాల్ ప్రకటించినట్లుగా కథనాలొచ్చాయి. మోదీకి కేజ్రీవాల్ షాకిస్తున్నారే అని ఫీలయ్యేలోగా ఢిల్లీ ప్రభుత్వం విధానాన్ని మార్చేసుకుంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సడలింపులను అమలు పరచబోమని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. తీరా సాయంత్రానికి నిర్ణయం మార్చుకుంది. ఢిల్లీలో ఆదివారం నుంచి దుకాణాలను తెరిచేందుకు అంగీకరించింది. ఒకవైపు కరోనా వ్యాప్తి ఉద్ధృతం అవుతుంటే ఇంకోవైపు సడలింపులు ఇవ్వడం దేనికని కేజ్రీవాల్ ఉదయాన్నే ప్రశ్నించిన కేజ్రీవాల్ సాయంత్రానికి సడలింపులకు సై అన్నారు. ఢిల్లీలో జనసాంద్రత తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా కరోనా వైరస్ నియంత్రణలో జాప్యం జరుగుతుందని భావిస్తున్న కేజ్రీవాల్.. కేంద్రం తాజాగా ఇచ్చిన సడలింపు అమలుపరచవద్దన్న నిర్ణయానికి కట్టుబడి వుంటారని అంతా అనుకున్నారు. అలా అనుకున్న వారికి షాకిచ్చారు కేజ్రీవాల్.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులపై తదుపరి నిర్ణయాన్ని ఏప్రిల్ 27వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరగనున్న వీడియో కాన్ఫరెన్సులో చర్చించిన మీదట నిర్ణయం తీసుకుంటామని తొలుగ ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,514కు చేరింది. అదే సమయంలో డిల్లీ మహానగరంలో 92 కు పైగా హాట్ స్పాట్ లను ఢిల్లీ ప్రభుత్వం గుర్తించింది. కొన్ని గ్రీన్ జోన్లలో కూడా కరోనా వైరస్ ప్రబలుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఆంక్షల సడలింపు ఏ మాత్రం సరికాదని భావించిన కేజ్రీవాల్… సాయంత్రానికి ప్రజల అవసరాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆదివారం నుంచి దుకాణాలు తెరుచుకునే ఛాన్స్ కల్పించింది. హోంశాఖ గైడ్‌లైన్స్ మేరకు షాపులు తెరిచే అవకాశాన్ని కల్పించిన ఢిల్లీ ప్రభుత్వం.. సోషల్ డిస్టెన్స్ నిబంధనలతో లావాదేవీలు నిర్వహించుకోవాలని కండీషన్ విధించింది. అయితే, కరోనా వైరస్ కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి వెసులుబాటు లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.




