AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లిదండ్రులకు హెచ్చరిక.. మీ పిల్లలు జాగ్రత్త! జంక్ ఫుడ్ జోలికి వెళ్తే ప్రమాదమే..

ఇటీవలి కాలంలో పిల్లలలో ఊబకాయం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆహార భద్రతా శాఖ కీలక చర్యలకు సిద్ధమవుతోంది. అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల పిల్లల శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు అందించే ఆహారం నాణ్యత, పోషక విలువలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, నివాస సంస్థల్లో అమలు చేయాల్సిన కొత్త మార్గదర్శకాలను రూపొందించే ప్రక్రియ ప్రారంభమైంది..

తల్లిదండ్రులకు హెచ్చరిక.. మీ పిల్లలు జాగ్రత్త! జంక్ ఫుడ్ జోలికి వెళ్తే ప్రమాదమే..
Junk Food And Childhood Obesity
Srilakshmi C
|

Updated on: Jul 24, 2026 | 1:50 PM

Share

పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థుల వసతి గృహాల పరిసరాల్లో విక్రయించే జంక్ ఫుడ్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని దుకాణాల నుంచి ఆహార నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ల్యాబ్ నివేదికల ఆధారంగా నాణ్యత ప్రమాణాలు పాటించని ఆహార పదార్థాలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జంక్ ఫుడ్ పదార్థాల్లో బంగాళాదుంప చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, పిజ్జా, హాట్ డాగ్స్, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, చాక్లెట్లు, డోనట్స్, ఫ్రైడ్ చికెన్, ఇన్‌స్టంట్ నూడుల్స్ వంటి పదార్థాలు పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయానికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం చిన్నారుల్లో ఊబకాయం ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ముఖ్యంగా 16 ఏళ్లలోపు పిల్లల్లో అధిక బరువు సమస్య పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. జంక్ ఫుడ్‌లో అధికంగా ఉండే చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు, కేలరీలు పిల్లల శరీరంలో కొవ్వు పెరగడానికి కారణమవుతున్నాయి. శారీరక శ్రమ తగ్గడం, ఎక్కువ సమయం మొబైల్, టీవీ ముందు గడపడం కూడా ఊబకాయం పెరగడానికి కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.

చిన్న వయసులోనే ఊబకాయం రావడం వల్ల భవిష్యత్తులో అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. నిపుణుల ప్రకారం అధిక బరువు ఉన్న పిల్లల్లో టైప్-2 మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, కీళ్ల సమస్యలు, ఫ్యాటీ లివర్, శ్వాసకోశ సమస్యలు, పిత్తాశయ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. పిల్లల ఎదుగుదలలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. తల్లిదండ్రులు పిల్లలకు రుచికరమైన ఆహారం మాత్రమే కాకుండా, పోషక విలువలు కలిగిన ఆహారం అందించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు, పాలు, పాల ఉత్పత్తులు, సంపూర్ణ ధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు చేర్చాలని సూచిస్తున్నారు.

అలాగే వేయించిన పదార్థాలు, ప్యాక్ చేసిన స్నాక్స్, అధిక చక్కెర కలిగిన పానీయాలను పరిమితం చేయాలని చెబుతున్నారు. పిల్లలు ఎక్కువ సమయం గడిపే పాఠశాలలు, విద్యాసంస్థల్లో ఆరోగ్యకరమైన ఆహార వాతావరణం కల్పించడం చాలా ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత మెరుగుపడటంతో పాటు, చిన్ననాటి నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెంపొందే అవకాశం ఉంది. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు జంక్ ఫుడ్ నియంత్రణతో పాటు, తల్లిదండ్రులు, పాఠశాలలు, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.

Follow Us